Tuesday, December 27, 2011

ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

  • కనీస మద్దతు ధర కాగితాలకే పరిమితం
  • అమలుకు నోచని జీఓ మూడు
  • సక్రమంగా వినియోగించని సబ్‌ ప్లాన్‌ నిధులు
  • మద్యం ముడుపుదారులను వెల్లడించాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ తీర్మానం
           రాష్ట్రంలో నెలకొన్న కరువు, విద్యుత్‌ కోతలు తదితర ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం విమర్శించింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆది, సోమవారాల్లో హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
                   రాష్ట్ర ముఖ్యమంత్రి, పాలకవర్గం పదవులు కాపాడుకోవడమే పరమావధిగా పనిచేస్తూ, ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో 876 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. 52 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే రూ.4,500 కోట్ల విలువైన పంటలకు నష్టం జరిగింది. రుణగ్రస్తులైన రైతులు గత రెండు మాసాల్లోనే 250 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ప్రభుత్వ సాయం అందలేదు. ప్రస్తుతం మార్కెట్లలో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు అమలుకావటం లేదు. క్వింటాలు రూ.1,110 అమ్మాల్సిన ధాన్యాన్ని రూ.800-900 మధ్య వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం, పత్తి, పసుపు పంటల ధరలు పూర్తిగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధరలకే కొనుగోలు చేస్తామంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఆర్భాటంగా చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వ సంస్థలు కొనుగోళ్లు జరపడం లేదు. జలయజ్ఞం కాంట్రాక్టర్లు తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే పనులు నిలిపేస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రాజెక్టులను చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతోంది.

                ప్రజలందరికీ వైద్య సౌకర్యం కల్పిస్తున్నామంటూ ముఖ్యమంత్రి పదేపదే ప్రకటిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరికి అందుబాటులోకి తెస్తామన్న ప్రభుత్వం 104 వైద్య సిబ్బంది సమస్యలను పరిష్కరించడం లేదు. 1200 మంది ఉద్యోగులను తొలగించకూడదని, జీవోనెం.3ను అమలు చేయాలని గత 48 రోజలుగా వారు ఆందోళనలు చేస్తున్నారు. 12,500 మంది కంప్యూటర్‌ టీచర్లకు వేతనాలు సవరించాలంటూ చేస్తున్న ఆందోళన పరిష్కారం కాకుండా ఉంది. ఫలితంగా వారు 100 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. మద్యాన్ని యేరులుగా పారించి పాలక పార్టీ నాయకులు ముడుపులు స్వీకరిస్తున్నారనే విషయం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడుల్లో వెల్లడైంది. ఆ వివరాలన్నింటినీ బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం.
             గిరిజనుల సంక్షేమ చర్యలు చేపట్టకపోగా వారి ఉనికికే ప్రమాదం తెచ్చే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. విశాఖ ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళనను ప్రభుత్వం నిర్బంధంగా అణిచివేయజూస్తున్నది. జిందాల్‌, ఆన్‌రాక్‌ కంపెనీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని గిరిజనుల ఉనికికి ప్రమాదం తెస్తోంది. ప్రకాశం జిల్లా మర్లపాడులో భూములను బలవంతంగా లాక్కొన్న కాంట్రాక్టర్లు ఐరన్‌ఓర్‌ (ముడి ఇనుము) తవ్వకానికి పూనుకున్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ప్రజా ఆమోదం లేకుండానే విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలకు భూములను అప్పగిస్తున్నారు. 2011-12 సంవత్సరానికి దళితులకు సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన రూ.7,500 కోట్లలో నేటికి రూ.2,400 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఈ పద్దు కింద స్త్రీశిశు సంక్షేమానికి రూ.33 కోట్లు కేటాయించగా కేవలం రూ.కోటీ 67 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. సబ్‌ప్లాన్‌ నిధులను సక్రమంగా వినియోగించాలంటూ జరుగుతున్న ఆందోళనలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ను ఇప్పటి వరకు నియమించలేదు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం అమలును నిలిపేశారు. గిరిజనులకు 25 లక్షల ఎకరాల పట్టాలిస్తామని చెప్పి 5.75 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారు. పట్టాలు పొందిన అనేక మందికి భూములు చూపించలేదు. నిరంతరం మహిళాభివృద్ది గురించి ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి ప్రతి మహిళకూ లక్ష రూపాయలు వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పారు. మరోవైపు డ్వాక్రా గ్రూపులకు కనీసం పావలా వడ్డీ రుణాలు కూడా ఇవ్వడం లేదు. చివరికి రాష్ట్ర మహిళా కమిషన్‌కు నియామకాలు లేవు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, ఫీజ్‌ రియంబర్స్‌మెంట్‌ నిధులను ట్రెజరీల నుండి విడుదల చేయనందున ఫీజులు చెల్లించాలంటూ కళాశాలల యాజ మాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి.
                   ప్రభుత్వం ఈ సంవత్సరం విద్యుత్‌, ఆర్‌టిసి బస్‌ ఛార్జీలు, వ్యాట్‌, ప్రాపర్టీ టాక్స్‌, నీటి పన్నులు, ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచి రూ.10,000 కోట్లకు పైగా భారాలు ప్రజలపై మోపింది.ఫ్యూయల్‌ సర్‌చార్జీలు, మద్యం మీద, వాహనాల మీద పన్నులు పెంచడానికి సిద్ధమవుతోంది. మరోసారి విద్యుత్తు ఛార్జీలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.12,000 కోట్లు చెల్లించకపోవడం వల్ల ఆ సంస్థలు విద్యుత్తు ఛార్జీల పెంపునకు ఉపక్రమిస్తున్నాయి. 2012-13 సంవత్సరానికి బడ్జెట్టు తయారీకి కసరత్తు జరుగుతోంది. బడ్జెట్‌ సామాన్య ప్రజలకుపయోగపడే విధంగా రూపొందించడానికి అన్ని తరగతుల సంఘాలతో, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోంది. 
                           ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

No comments:

Post a Comment