Wednesday, December 7, 2011

నిలుపుదల కాదు... రద్దు చేయాల్సిందే - ప్రకాశ్‌ కరత్‌

  • ఒక్క ఉద్యోగమొస్తే 17 పోతాయి
  • ప్రభుత్వం దిగొచ్చేదాక పోరాడతాం
  • రిటైల్‌ ఎఫ్‌డిఐపై ప్రకాష్‌ కరత్‌
  • బుక్‌లెట్‌ విడుదల
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినివ్వాలన్న నిర్ణయాన్ని యుపిఎ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ' రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐలకు అనుమతినివ్వాలన్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఇది ఒక పన్నాగం మాత్రమే. పార్లమెంటు శీతకాల సమావేశాలు ముగిసేదాకా నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 పూర్తవుతోంది కాబట్టి..2012లో తిరిగి నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దీనికి సిపిఎం అంగీకరించదు. రిటైల్‌లో ఎఫ్‌డిఐల నిర్ణయాన్ని నిలుపుదల చేయడం కాదు పూర్తిగా రద్దు చేయాలి ' అని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ స్పష్టం చేశారు. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులతో జరిగే నష్టాలను వివరిస్తూ పార్టీ రూపొందించిన బుక్‌లెట్‌ను మంగళవారమిక్కడ ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాటాడుతూ 2005లో యుపిఎ ప్రభుత్వం తొలిసారి ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినప్పటి నుండీ తాము స్థిరంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ' నిలుపుదల పేరుతో ప్రతిపక్షాలను, ప్రజలను మాయ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తే అది సరికాదు. కోట్లాది ప్రజల ఉపాధికి సంబంధించిన ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకునే వరకూ మా పోరాటం కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా భావసారూప్య శక్తులన్నింటినీ కూడగట్టి, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతాం ' అని ఆయన అన్నారు. 


            ప్రభుత్వ నిలుపుదల ప్రకటన నేపథ్యంలో పార్లమెంటు సజావుగా నడుస్తుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా..' ప్రభుత్వం తన నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేసేవరకూ సమస్య పరిష్కారమౌతుందనిభావించడం లేదు. బుధవారం జరిగే అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం ఏమి చెబుతుందో చూద్దాం. ఆ తర్వాత మా పార్టీ ఒక వైఖరి తీసుకుంటుంది ' అని ఆయన సమాధానమిచ్చారు. ఎఫ్‌డిఐలను అనుమతించడం ద్వారా దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయని, రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం కట్టుకథలను ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. బుక్‌లెట్‌లో ప్రభుత్వ వాదనలన్నీ ఏ విధంగా అసత్యాలో చాలా స్పష్టంగా పేర్కొన్నామన్నారు. 2004లో అధికారంలోకి వచ్చినప్పటి నుండీ మన్మోహన్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం రిటైల్‌లో ఎఫ్‌డిఐలపై దృష్టి సారించిదన్నారు. నాడు జార్జిబుష్‌, నేడు ఒబామాకు ఎఫ్‌డిఐల అనుమతిపై మన్మోహన్‌ ప్రభుత్వం స్పష్టమైన హామీనిచ్చిందన్నారు. రిటైల్‌లోకి ఎఫ్‌డిఐలపై తమ అభ్యంతరాలను 2005లో యుపిఎకి సమర్పించిన నోట్‌లోనే సిపిఎం విపులంగా పేర్కొందన్నారు. 'వాల్‌మార్ట్‌ వంటి సంస్థల రాకతో దేశంలోని 1.2 కోట్ల చిల్లర దుకాణాలు మూతపడక తప్పదు. వీటిలో పనిచేస్తున్న నాలుగు కోట్ల మంది ఉపాధీ ప్రశ్నార్థకమౌతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి భారీ రిటైల్‌ సంస్థల చరిత్రను చూసినా ఇదే విషయం స్పష్టమౌతుంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా మూడేళ్లలో కోటి ఉద్యోగాలు రావడం ఒట్టి బూటకం.
              వాల్‌మార్ట్‌ తదితర సంస్థలు దేశంలో సృష్టించే ప్రతి ఒక్క కొత్త ఉద్యోగం కారణంగా...17 పాత ఉద్యోగాలు పోతాయని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి...' అని కరత్‌ పేర్కొన్నారు. దేశంలోని కేవలం 53 నగరాల్లోనే ఎఫ్‌డిఐలను అనుమతిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలో పసలేదన్నారు. దేశంలో ఉన్న మొత్తం 4 కోట్ల మంది చిల్లర వర్తకుల్లో 2 కోట్ల మంది ఈ 53 నగరాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారని తెలిపారు. విదేశీ సంస్థల ప్రవేశంతో దేశంలో గిడ్డంగి సౌకర్యాలు పెరుగుతాయన్న ప్రభుత్వ ప్రచారమూ అవాస్తవమేనన్నారు. ' ఎఫ్‌సిఐ స్థానంలో దేశ ప్రజల కోసం వాల్‌మార్ట్‌ గోడౌన్లను నిర్మించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. వ్యాపారాన్ని పక్కన బెట్టి ఈ సంస్థలు ప్రజలకు సేవ చేస్తాయని భావించడం హాస్యాస్పదం కాదా ? 'అని ప్రశ్నించారు. అమెరికాలోనూ నేటికీ 70 శాతం గిడ్డంగి వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే ఉందన్నారు. ఒకసారి దేశంలో పాగా వేశాక, దేశ రైతులకు ఎంత ధరలు ఇవ్వాలన్న విషయాన్ని వాల్‌మార్ట్‌ లాంటి సంస్థలే నిర్దేశిస్తాయన్నారు. బ్రిటన్‌తో పాటు పలు దేశాల అనుభవం ఇదేనన్నారు. ' రిటైల్‌ సంస్థలు ఒక్క ఆహార వస్తువులనే అమ్మవు. దేశంలో చిన్నచిన్న పరిశ్రమల్లో ఉత్పత్తవుతోన్న అనేక రకాల గృహోపకరణాలు, ఇతర వస్తువులనూ అమ్ముతాయి. వీటిని చౌకగా విదేశాల నుండీ దిగుమతి చేస్తాయి. దీంతో దేశీయ చిన్న తయారీదారులూ తీవ్రంగా నష్టపోవడం ఖాయం ' అని అన్నారు.
దేశీయ సంస్థలకు నియంత్రణ అవసరం
             దేశంలో రిటైల్‌ రంగంలోకి ప్రవేశిస్తోన్న బడా కార్పొరేట్‌ కంపెనీల విషయంలోనూ నియంత్రణలు అవసరమని ఈ సందర్భంగా కరత్‌ వ్యాఖ్యానించారు. ఎటువంటి నియంత్రణలు అమలు చేయాలన్న విషయంపై 2007లోనే తాము సమగ్రమైన నోట్‌ను రూపొందించి, యుపిఎ ప్రభుత్వానికి అందజేశామన్నారు. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అమనుమతించిన కారణంగా చైనాలోనూ నష్టం జరిగిందని మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రభుత్వం రిటైల్‌లో ఎఫ్‌డిఐలను 51 శాతం మాత్రమే అమనుతించింది కదా అన్న ప్రశ్నకు.. ' టివి మీడియాలోనూ ఈపాటికే 26 శాతం ఎఫ్‌డిఐలను అనుమతించారు. వాస్తవానికి దేశంలో డమ్మీ కంపెనీలను స్థాపించి పూర్తి వాటాను విదేశీ బహుళ జాతి సంస్థలే నిర్వహిస్తున్నాయి. స్టార్‌ టివి ఛానళ్లలో మర్డోక్‌ వాటా 26 శాతమేనని మీరు భావిస్తున్నారా ?..' అని కరత్‌ ప్రశ్నించారు. 
                              ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

No comments:

Post a Comment