Wednesday, December 14, 2011

సోషలిజమే ప్రత్యామ్నాయం.

           సోవియట్‌ యూనియన్‌, తూర్పు యూరోపియన్‌ దేశాల్లో సోషలిస్ట్‌ వ్యవస్థ పతనమై ఇరవై సంవత్సరాలైంది. సోషలిస్టు వ్యవస్థ కూలిపోవడంపై చంకలు గుద్దుకున్న పెట్టుబడిదారీ ప్రపంచం, మరీ ముఖ్యంగా సామ్రాజ్యవాద శక్తులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సోషలిస్ట్‌ శిబిరంలో ఉపద్రవం నెలకొన్న దశాబ్దానికే పెట్టుబడిదారీ వ్యవస్థ కోలుకోలేని సంక్షోభంలో పడిపోయింది. ప్రస్తుత సహస్రాబ్ధి ఆరంభం నుండి సంక్షోభాన్ని చవిచూస్తున్న పెట్టుబడివారీ వ్యవస్థ ఈ సుడిగుండంలోంచి ఎలా బయటపడాలో తెలియక దిక్కులు చూస్తోంది. పెట్టుబడిదారీ అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు క్రమంగా పతనమవుతున్నది. నిరుద్యోగం పెరిగిపోతున్నది. మార్కెట్‌ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్నది. షేర్‌ మార్కెట్‌ కుప్పకూలింది. భారీ ఆర్థిక సంస్థలు కూడా పేకమేడలా ఒకటి తరువాత ఒకటి కూలుతున్నాయి. ప్రస్తుత శతాబ్దం మొదటి దశాబ్దంలో అంటే 2008 సెప్టెంబరు మధ్యలో తలెత్తిన ఈ సంక్షోభం 1930 నాటి మహా మాంద్యాన్ని తలపింపచేస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదని వాదించిన వారు నేడు తమ ఉనికి కోసం పోరాడాల్సిన స్థితిలో పడ్డారు. ఇందుకు భిన్నమైన పరిస్థితి సోషలిస్టు శిబిరంలో నెలకొంది. సోషలిస్టు వ్యవస్థ తిరిగి మరింత బలంగా పుంజుకుంటున్నది. సోషలిస్టు వ్యవస్థ పతనమైన గడ్డపైనే కమ్యూనిస్టులు గణనీయమైన శక్తిగా తిరిగి ఎదుగుతున్నారు. చైనా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వేగవంతమైన పురోభివృద్ధిని నమోదు చేసుకుంటోంది. ఈ శతాబ్దం మధ్య నాటికి ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక శక్తిగా ఎదగగలదని భావిస్తున్నారు. సోషలిస్టు క్యూబా ప్రపంచంలో అతి పెద్ద సైనిక, ఆర్థిక శక్తిగా ఉన్న అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొంటూనే ప్రశంసనీయమైన అభివృద్ధి రేటును సాధించింది. అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో వామపక్ష భావాలు గల పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి.


            ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా కార్మికులు సామ్రాజ్యవాదశక్తుల యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కార్మికులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శనల్లో ఆర్థికపరమైన డిమాండ్లనే కాకుండా పాలస్తీనాకు సంఘీభావం ప్రదర్శించడం వంటి వర్తమాన రాజకీయ అంశాలపై కూడా ప్రతిస్పందిస్తున్నారు. అమెరికా నిర్బంధించిన ఐదుగురు క్యూబన్ల విడుదలకై గళం విప్పుతున్నారు. అమెరికా కొంత మంది యుద్ధ కండూతి గల లేదా కొన్ని బహుళ జాతి కార్పొరేట్‌ సంస్థల గుత్తసొత్తు కాదని ఆ గడ్డమీదనే నినాదాలు వినిపిస్తున్నాయి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాపితంగా కార్మికవర్గాన్ని సంఘటితపరచడంలో మంచి కృషి చేస్తున్న కార్మిక సంఘాల ప్రపంచ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టియు) ఈ పరిణామాల పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచ కార్మికులను సంఘటితపరచి, ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని సంకల్పించింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు దృఢమైన, తిరుగులేని ప్రత్యామ్నాయం సోషలిజమేనని, కష్ట జీవులందరి సంక్షేమానికి హామీ ఇవ్వగల ఏకైక వ్యవస్థ ఇదేనని ఎలుగెత్తి చాటింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విప్లవకరమైన అంతర్జాతీయ కార్మిక సంఘాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని డబ్ల్యుఎఫ్‌టియు అభిప్రాయపడింది. 

             ఆ సంఘం ఈ కింది ప్రధాన లక్షణాల ఆధారంగా ఏర్పడాలని చెప్పింది.  వాటిలో కొన్ని :
- పెట్టుబడిదారీ వ్యవస్థ్థకు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడే విప్లవకర ఆలోచనా ధోరణి, వర్గ థృక్పథాన్ని ఇది కలిగి ఉండాలి.

- సమాజంలో అట్టడుగు నుంచి వచ్చే నాయకులు నిజాయితీగా, నిక్కచ్చిగా, విమర్శ, ఆత్మవిమర్శ, క్రమశిక్షణను అలవర్చుకునేవారై ఉండాలి.బ్యూరోక్రసీ, అవినీతిపై పోరాడే వారికి మద్దతు తెలపాలి.
- జాతి, మతం, వర్ణం, లింగ భేదాలు లేకుండా కార్మికులు, పేద రైతులు, యువకులందరిలోనూ ఐక్యతాభావం నెలకొల్పాలి.
- పెట్టుబడి, గుత్తాధిపత్య కార్పొరేట్‌ సంస్థలకు వ్యతిరేకంగా సాగించే పోరాటాల్లో వీరిని భాగస్వాములను చేయాలి. 
- కార్మిక సంఘం, ప్రజాతంత్ర హక్కులు, జీవించే హక్కులను కాపాడుకునేందుకు జరిగే పోరాటంలో ప్రతి దేశంలోని కార్మికవర్గం పరస్పర సహకారం, సంఘీభావం (నైతిక, ఆర్థిక మద్దతు) ప్రకటించాలి.
- ఒక జాతిని మరొక జాతి, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేసే వ్యవస్థను అంతమొందించేందుకు వర్గపోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

- వ్యాసం: ప్రదీప్‌ బిశ్వాస్‌  సిఐటియు నాయకులు
               (పెరూ రాజధాని లిమాలో ఇటీవల జరిగిన కార్మిక సంఘాల ప్రపంచ సమాఖ్య (సిజిటిపి) 13వ మహాసభ)
                   ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

No comments:

Post a Comment