Saturday, April 14, 2012

కార్టూన్‌ వేయడం నేరమా?




పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ సర్కార్‌ మరో అప్రజాస్వామిక చర్యకు పాల్పడింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర రైల్వే మంత్రి ముకుల్‌రారు, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్‌ త్రివేదిపై వ్యంగ్య కార్టూన్‌ వేసిన జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ అంబికేష్‌ మహాపాత్రపై సైబర్‌ నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసింది. అంతకు ముందు ప్రొఫెసర్‌పై తృణమూల్‌ గూండాలు దాడి చేసి విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. తృణమూల్‌ గూండాలు దాడి చేసి వెళ్లగానే పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం.
                 కార్టూన్‌ వేసి సామాజిక నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లలో ఉంచిన ప్రొఫెసర్‌ను అరెస్టు చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకునే హక్కు కూడా పౌరులకు లేదా. ప్రభుత్యాధినేతలకు వ్యతిరేకంగా ప్రతిదినం దినపత్రికల్లో వ్యంగ్య కార్టూన్లు వస్తున్న విషయాన్ని ఉదహరిస్తున్న నెటిజన్లు, ఈ అరెస్టుతో బెంగాల్‌ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. పలు అంశాలు, వ్యక్తులు, విధానాలు, తదితర ప్రతి అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించడం, చర్చించడం సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లలో సర్వ సాధారణం. సృజనాత్మకత ఉన్న ఎంతో మంది సామాజిక వెబ్‌సైట్ల ద్వారా వ్యంగ్య కార్టూన్లు, పేరడీ గేయాలు, పాటలు, వీడియోలను ఉంచుతూ తమ ప్రతిభను ప్రదర్శించుకుంటున్నారు.
               ప్రధాని మన్మోహన్‌, కేంద్ర మంత్రులు, ఇతర దేశాల నేతలపై కూడా ఎన్నో వ్యంగ్య కార్టూన్‌లు మనకు వెబ్‌సైట్లలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే అన్ని రకాల స్వేచ్ఛలనూ హరించి వేయడమే లక్ష్యంగా ఇటీవల కాలంలో నిర్ణయాలు తీసుకుంటున్న మమతా సర్కారుకు తమ సిఎంపై వ్యంగ్య కార్టూన్‌ వేయడం కోపం తెప్పించింది. అంతే, ఆఘమేఘాల మీద సైబర్‌ చట్టాల కింద కేసు నమోదు, అరెస్ట్‌ కూడా జరిగిపోయింది. మహిళలపై అత్యాచారాలు, హత్య కేసుల్లోనూ, ఇతర తీవ్ర సంఘటనల్లోనూ ప్రజల నుంచి డిమాండ్‌ వచ్చే వరకూ ఏనాడూ స్పందించని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేసు నమోదు నుంచి అరెస్ట్‌ వరకూ అన్ని కార్యక్రమాలూ ఒక్క రోజులోనే చేపట్టడం గమనార్హం.
              సినీ దర్శకుడు మృణాల్‌ సేన్‌, చిత్రకారుడు వసీం కపూర్‌, సాంస్కృతిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సర్కారు తీరును తప్పుపట్టారు. ప్రొఫెసర్‌పై సైబర్‌ నేరాలు మోపడం పూర్తి అన్యాయమని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. తమ ప్రొఫెసర్‌ అరెస్టుకు నిరసనగా జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ విద్యార్థులు వర్శిటీ ప్రాంగణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఫాసిస్టు ధోరణిని అవలంబిస్తోందని, చిన్నపాటి విమర్శను కూడా సహించలేక పోతోందని అందరు విమర్శించారు. 
 ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

Tuesday, April 10, 2012

ప్రపంచ మానవాళిని ఉత్తేజపరుస్తూనే ఉన్న మానవతామూర్తి...


మూర్తీభవించిన మానవత్వమే లెనిన్‌!
మహామేధస్సు, సంపూర్ణ మానవతల సమ్మేళనమే లెనిన్‌! 

    అరుదైన ఆ మానవోత్తముడు 1870 ఏప్రిల్‌ 10న జన్మించారు. మానవాళికి న్యాయమార్గం చూపటానికా అన్నట్లు 1893లో న్యాయవాది అయ్యారు. న్యాయమైన సమసమాజ స్థాపనా లక్ష్యంతో 1895లో విప్లవవాది అయ్యారు. ఉద్యమ భాగస్వామి కృపస్కయను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. 1917 అక్టోబరు 7న బోల్షివిక్‌ పార్టీ సారథ్యంలో 'యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌'కు అధ్యక్షులయ్యారు!

    1917 అక్టోబరు 25 రాత్రి ఒక అద్భుతమైన రాత్రి! అది కెరెన్‌స్కీ ప్రభుత్వం పతనమైన రాత్రి! రెండు దశాబ్దాలుగా పలు శిక్షలకు గురవుతూ, అజ్ఞాతవాసంలో మగ్గిన లెనిన్‌, అర్ధాంగితో సహా తన మిత్రుని ఇంట స్వేచ్ఛగా విశ్రాంతి తీసుకున్న రాత్రి! 'ఈ క్షణం నుండి, ఎట్టి నష్టపరిహారమూ చెల్లించకుండా, భూస్వాముల అస్తి రద్దు చేయబడింది'' అను సోషలిస్టు రిపబ్లిక్‌ తొలి డిక్రీని రూపొందించి, లెనిన్‌ చరిత్ర గతినే మార్చేసిన రాత్రి! సదరు డిక్రీని మళ్లీ,మళ్లీ చూసుకుంటూ, ''ఇక నుండి ఈ పొలం అనే ఆవు, రైతులు, వ్యవసాయ కూలీలు అనే తన లేగదూడలకు తాగినన్ని పాలు ఇస్తుంది! వాళ్లంతా తమ తల్లిపాలను తనివితీరా తాగుతారుగదా!'' అన్న భావనతో ఆ ఆనందాన్ని అమితానందంతో నిద్రపట్టని వారి మిత్రుడు కూడా అక్కడికొచ్చి వారినలా చూసి పరవశంలో గంతులేస్తుంటాడు. మానవులంతా సుఖంగా జీవించే మార్గాన్ని చూపగలిగినందుకు, ఆనంద కెరటాల తాకిడికి లెనిన్‌ ఉక్కిరిబిక్కిరియైన ఆ రాత్రి నిజంగా మహాద్భుతమైన రాత్రి!

     లెనిన్‌ మనసు, మాట, చేతల కెన్నడూ తేడా కనిపించలేదు. త్రికరణశుద్ధిగా సోషలిస్టు లక్ష్యానికి అంకితమయ్యారు. సమసమాజపు వెలుగు కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు! జీవితాంతమూ మద్యం, పొగాకు ముట్టని ఆదర్శనేత! ఆరోగ్యం కోసం మెరుగైన ఆహారం, ప్రత్యేక వసతులు అవసరమని డాక్టర్లు, ఆత్మీయులు మొత్తుకుంటున్నా 'ప్రజలు హీనంగా బతుకుతున్న సమయంలో అంతకన్నా బాగా బతికే నైతిక హక్కు నాకు లేదు' అంటూ వాటిని తిరస్కరించారు లెనిన్‌! మానవతను గూర్చి ఆయనకు మించిన అవగాహన కలవారు లేరు! లెనిన్‌ విప్లవ సాహసానికి, విజయానికీ అదే ఆయువుపట్టు!


          లెనిన్‌ జీవితాంతం ప్రతి మనిషి పట్లా, అతని వృత్తి ఉద్యోగ, హోదాలతో నిమిత్తం లేకుండా అమితంగా శ్రద్ధ వహించారు! ఆయన దయార్ద్ర హృదయాన్ని, ప్రేమ ఆప్యాయతలను ఒక్కసారైనా చవిచూడని కామ్రేడ్‌గాని, గ్రామం గాని సోషలిస్టు రష్యాలో లేదంటే అతిశయోక్తి కాదు.  సమసమాజపు వెలుగు కోసం కొవ్వొత్తిలా ఆత్మార్పణ చేసుకుంటూ నాటి కరాళ కరువు, భయంకర అంతర్‌, బాహ్య యుద్ధాల బారి నుండి తమ సోషలిస్టు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు, నాడు రష్యన్లను ఉత్తేజపరచిన ఆ మహనీయ, మానవతామూర్తి లెనిన్‌, నేటికీ అట్టి సమసమాజం కోసం తపనతో శ్రమించేలా ప్రపంచ మానవాళిని ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. అమరజీవి లెనిన్‌!

 ఏప్రిల్‌ 10న 142వ జయంతి సందర్భంగా   

Monday, April 2, 2012

సీపీఐ జాతీయ సారథ్య బాధ్యతలను చేపట్టిన తెలుగువారు


  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. పాట్నాలో జరిగిన సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ)21వ జాతీయ మహాసభల్లో బర్థన్ స్థానంలో ఆయన్ని పార్టీ ప్రతినిధులు ఎన్నుకున్నారు. జాతీయ రాజకీయ చిత్రంపై మరోసారి ఓ తెలుగువారిని ఉన్నతమైన పదవి వరించింది. 24ఏళ్ళ తర్వాత సీపీఐ సారథ్య బాధ్యతలను చేపట్టిన తెలుగువారిగా సురవరం చరిత్ర సృష్టించారు.

    సుదీర్ఘ కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం కలిగిన సురవరం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారు.  సమరశీల రాజకీయ కార్యకర్త, మేధావి, మంచి వక్త.  2008 మార్చి నుండి పార్టీ ఉపప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పటికి ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి కార్యదర్శిగా, జాతీయ సమితి కార్య వర్గ సభ్యులుగా వున్నారు.
            సురవరం నల్గొండ నుంచి 1998లో తిరిగి 2004 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికై ప్రతిభావంతుడైన పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు.