Tuesday, April 10, 2012

ప్రపంచ మానవాళిని ఉత్తేజపరుస్తూనే ఉన్న మానవతామూర్తి...


మూర్తీభవించిన మానవత్వమే లెనిన్‌!
మహామేధస్సు, సంపూర్ణ మానవతల సమ్మేళనమే లెనిన్‌! 

    అరుదైన ఆ మానవోత్తముడు 1870 ఏప్రిల్‌ 10న జన్మించారు. మానవాళికి న్యాయమార్గం చూపటానికా అన్నట్లు 1893లో న్యాయవాది అయ్యారు. న్యాయమైన సమసమాజ స్థాపనా లక్ష్యంతో 1895లో విప్లవవాది అయ్యారు. ఉద్యమ భాగస్వామి కృపస్కయను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. 1917 అక్టోబరు 7న బోల్షివిక్‌ పార్టీ సారథ్యంలో 'యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌'కు అధ్యక్షులయ్యారు!

    1917 అక్టోబరు 25 రాత్రి ఒక అద్భుతమైన రాత్రి! అది కెరెన్‌స్కీ ప్రభుత్వం పతనమైన రాత్రి! రెండు దశాబ్దాలుగా పలు శిక్షలకు గురవుతూ, అజ్ఞాతవాసంలో మగ్గిన లెనిన్‌, అర్ధాంగితో సహా తన మిత్రుని ఇంట స్వేచ్ఛగా విశ్రాంతి తీసుకున్న రాత్రి! 'ఈ క్షణం నుండి, ఎట్టి నష్టపరిహారమూ చెల్లించకుండా, భూస్వాముల అస్తి రద్దు చేయబడింది'' అను సోషలిస్టు రిపబ్లిక్‌ తొలి డిక్రీని రూపొందించి, లెనిన్‌ చరిత్ర గతినే మార్చేసిన రాత్రి! సదరు డిక్రీని మళ్లీ,మళ్లీ చూసుకుంటూ, ''ఇక నుండి ఈ పొలం అనే ఆవు, రైతులు, వ్యవసాయ కూలీలు అనే తన లేగదూడలకు తాగినన్ని పాలు ఇస్తుంది! వాళ్లంతా తమ తల్లిపాలను తనివితీరా తాగుతారుగదా!'' అన్న భావనతో ఆ ఆనందాన్ని అమితానందంతో నిద్రపట్టని వారి మిత్రుడు కూడా అక్కడికొచ్చి వారినలా చూసి పరవశంలో గంతులేస్తుంటాడు. మానవులంతా సుఖంగా జీవించే మార్గాన్ని చూపగలిగినందుకు, ఆనంద కెరటాల తాకిడికి లెనిన్‌ ఉక్కిరిబిక్కిరియైన ఆ రాత్రి నిజంగా మహాద్భుతమైన రాత్రి!

     లెనిన్‌ మనసు, మాట, చేతల కెన్నడూ తేడా కనిపించలేదు. త్రికరణశుద్ధిగా సోషలిస్టు లక్ష్యానికి అంకితమయ్యారు. సమసమాజపు వెలుగు కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు! జీవితాంతమూ మద్యం, పొగాకు ముట్టని ఆదర్శనేత! ఆరోగ్యం కోసం మెరుగైన ఆహారం, ప్రత్యేక వసతులు అవసరమని డాక్టర్లు, ఆత్మీయులు మొత్తుకుంటున్నా 'ప్రజలు హీనంగా బతుకుతున్న సమయంలో అంతకన్నా బాగా బతికే నైతిక హక్కు నాకు లేదు' అంటూ వాటిని తిరస్కరించారు లెనిన్‌! మానవతను గూర్చి ఆయనకు మించిన అవగాహన కలవారు లేరు! లెనిన్‌ విప్లవ సాహసానికి, విజయానికీ అదే ఆయువుపట్టు!


          లెనిన్‌ జీవితాంతం ప్రతి మనిషి పట్లా, అతని వృత్తి ఉద్యోగ, హోదాలతో నిమిత్తం లేకుండా అమితంగా శ్రద్ధ వహించారు! ఆయన దయార్ద్ర హృదయాన్ని, ప్రేమ ఆప్యాయతలను ఒక్కసారైనా చవిచూడని కామ్రేడ్‌గాని, గ్రామం గాని సోషలిస్టు రష్యాలో లేదంటే అతిశయోక్తి కాదు.  సమసమాజపు వెలుగు కోసం కొవ్వొత్తిలా ఆత్మార్పణ చేసుకుంటూ నాటి కరాళ కరువు, భయంకర అంతర్‌, బాహ్య యుద్ధాల బారి నుండి తమ సోషలిస్టు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు, నాడు రష్యన్లను ఉత్తేజపరచిన ఆ మహనీయ, మానవతామూర్తి లెనిన్‌, నేటికీ అట్టి సమసమాజం కోసం తపనతో శ్రమించేలా ప్రపంచ మానవాళిని ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. అమరజీవి లెనిన్‌!

 ఏప్రిల్‌ 10న 142వ జయంతి సందర్భంగా   

No comments:

Post a Comment