Tuesday, January 31, 2012

దోపిడీ వ్యవస్థలో మార్పు తేవటానికి ప్రజలు ముందుకు రావాలి - సీతారాం ఏచూరి

  • సీతారాం ఏచూరి ఉద్ఘాటన
  • భవిష్యత్తు అరుణ పతాకదే
                       ప్రస్తుతం దేశ ప్రజలకు కావల్సింది కార్పొరేట్‌, సామ్రాజ్యవాద అనుకూల విధానాలు కాదని, వామపక్ష ప్రజాతంత్ర విధానాలు అవసరమని సిపిఎం నేత సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. సిపిఎం హర్యానా రాష్ట్ర మహాసభల ముగింపు అనంతరం పట్టణంలోని హుడా పార్క్‌లో సోమవారం జరిగిన భారీ బహిరంగసభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం కొనసాగుతున్న దోపిడీ వ్యవస్థలో మార్పు తేవటానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  కొద్దిమంది పెట్టుబడిదారులకు కాక పేద, బడుగు, బలహీన వర్గాల కోసం మెరుగైన భారతాన్ని నిర్మించేందుకు సూచిక అని అభివర్ణించారు. ప్రస్తుతం అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ సోషలిజానికి మాత్రమే భవిష్యత్తు ఉందని స్పష్టం చేశారు. 'భవిష్యత్తు అరుణ పతాకదే తప్ప పెట్టుబడి దారులది కాదు' అన్నారు. చిల్లర వాణిజ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటాన్ని, ప్రస్తుతం పార్లమెంట్‌లో పెండింగ్‌లో వున్న పెన్షన్‌ నిధుల నియంత్రణ (పిఎఘఆర్‌డిఎ) బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

Sunday, January 29, 2012

స్వతంత్ర శక్తిగా ఎదగడమే లక్ష్యం - ప్రకాశ్‌ కరత్‌

  • వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయానికై కృషి
  • ఆర్థిక సంస్కరణలపై విశాల ప్రజా ఉద్యమం
  • మతోన్మాదంపై పోరాటం కొనసాగిస్తాం
  • ముసాయిదా రాజకీయ తీర్మానంలో సిపిఎం
'               ఎన్నికల వైఫల్యాలు, పార్టీకి అత్యంత బలమైన బెంగాల్‌లో జరుగుతోన్న దాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ ప్రభావాన్ని, పునాదిని విస్తరింప చేయడం అత్యంత ప్రధానం. పార్టీ స్వతంత్ర కార్యాచరణను పెంపొందించడం, విస్తరింప చేయడం ద్వారానే ఇది సాధ్యం. పార్టీ పెరుగుదలకు ఇదే కీలకం..' అని సిపిఎం ముసాయిదా రాజకీయ తీర్మానం పేర్కొంది. దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం రూపకల్పనే లక్ష్యంగా రాజకీయ కార్యాచరణ ఉండాలని పిలుపునిచ్చింది. ఏప్రిల్‌ 4 నుండి 9 వరకూ పార్టీ అఖిలభారత మహాసభ కేరళలోని కోజికోడ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ముసాయిదా తీర్మానంపై సూచనలు,సవరణలను ఆహ్వానించారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, వరదరాజన్‌ ముసాయిదాను విడుదల చేశారు. ' పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని, స్వతంత్ర పాత్రను పెంపొందించాలని తీర్మానం పేర్కొంది. కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా దేశంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను అంశాల వారీగా సమీకరిస్తాం. వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ఏర్పర్చాలన్న దీర్ఘకాల లక్ష్యంలో ఇదీ భాగమే ' అని ఈ సందర్భంగా కరత్‌ వ్యాఖ్యానించారు. 2008లో జరిగిన పార్టీ మహాసభ అనంతరం జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ పరిణా మాలను ముసాయిదాలో పొందు పర్చినట్లు చెప్పారు. ముసాయిదాలోని ప్రధాన అంశాలను ఆయన మీడియాకు వివరించారు. 2007-08లో ప్రారంభమైన అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభం కొనసాగుతోందన్నారు. ఫలితంగా అమెరికాతో పాటు యూరప్‌లోని పలు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నాయని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వ కోతలు, నిరుద్యోగం పెరగడం ఈ దేశాలన్నింటిలోనూ ఉమ్మడిగా కనిపిస్తోందన్నారు. సంక్షోభం నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారని చెప్పారు. ఈ కాలంలో అరబ్‌ దేశాల్లోనూ పలు చోట్ల ప్రజాస్వామ్య ఉద్యమాలు పెల్లుబికాయని, ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నాటో రూపంలో అమెరికా కుట్రలు చేస్తోందని వ్యాఖ్యానించారు. 
              లాటిన్‌ అమెరికా దేశాల్లోనూ వామపక్ష శక్తులు ఈ కాలంలో పుంజుకున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతమయ్యేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ' పెట్టుబడి దారీ వ్యవస్థకు ఇక తిరుగేలేదని సరిగ్గా రెండు దశాబ్ధాల క్రితం అన్నారు. ఇప్పుడు ఆ వాదన మసకబారుతోంది. పెట్టు బడిదారీ వ్యవస్థ మనుగడపైనే మేథావు లందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. సోషలిజమే అజేయమన్న నినాదానికి ఇప్పుడు మరింత ప్రాధాన్యత ఏర్పడింది ' అని కరత్‌ వ్యాఖ్యానించారు.
( ప్రజాశక్తి సౌజన్యంతో..... )  
 

Tuesday, January 24, 2012

నవ భారతం నిర్మిద్దాం...

నవ భారతం నిర్మిద్దాం

  • విద్యార్థులు, యువతకు పిలుపు
  • భగత్‌సింగ్‌ వారసత్వాన్ని బలపర్చాలి
  • ఎస్‌ఎఫ్‌ఐ బహిరంగసభలో సీతారాం ఏచూరి
                 నూతన భారతదేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత విద్యార్థులూ, యువతపై ఉందని ఉమ్మడి ఉద్యమాలతోనే అది సాధ్యమవుతుందని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ 19వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సోమవారం కడపలో మున్సిపల్‌ క్రీడా ప్రాంగణం నుంచి పాత బస్టాండు వరకు విద్యార్థులు మహా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం సూర్యారావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఏచూరి మాట్లాడుతూ కేంద్రంలోని యుపిఎ-2 ప్రభుత్వం దోపిడీ, దౌర్జన్య విధానాలను అవలంబిస్తోందని సోదాహరణంగా వివరించారు. ఈ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా విద్యారి ్థలోకం పోరాడాలని కోరారు. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం తీవ్రమైందనీ, వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా 1500 పట్టణాలకు వ్యాపించిన విషయాన్ని ఏచూరి ప్రస్తావిస్తూ మునుముందు పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు విస్తృతమౌతాయని తెలిపారు. దోపిడీ, దౌర్జన్యాలు లేకుండా పెట్టుబడిదారీ విధానం బతకలేదనీ, అందుచేత దానికి ప్రత్యామ్నాయం సోష లిజం తప్ప మరోటి లేదన్నారు. ప్రపంచంలో వస్తున్న పోరాటాలను అధ్యయనం చేయాలి... ఆ అవగాహనతో మన దేశ పరిస్థి తులను మార్చాలని కోరారు. నూతన భారత దేశాన్ని నిర్మించాలని ఏచూరి అన్నారు.
             దేశంలో నూటికి తొమ్మిది మంది మాత్రమే ఉన్నత విద్యకు చేరుకుంటున్నారని, అది 25 నుంచి 30 శాతానికి పెరిగితే ప్రపంచానికే నాయకత్వం వహించే సామర్థ్యం భారతీయులకూ ఉంటుంద న్నారు. విద్య అందించే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయని అన్నారు. 6-14 ఏళ్లలోపు పిల్లలందరికీ విద్య అందించాలని విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే విద్యతోపాటు, మధ్యాహ్న భోజనం, యూనిఫారమ్స్‌, ఉచితంగా పుస్తకాలు, పాఠశాలల భవనాలు, ఉపాధ్యాయుల నియామకాలు చేయాలనీ చట్టంలో ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లవు తున్నా నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరలేదన్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడానికి ఏటా రూ.35వేల కోట్లు ఖర్చవుతాయని ప్రణాళికా సంఘం అంచనా వేసిందన్నారు. ఐదేళ్లపాటు అమలు చేస్తే రూ.1.75 లక్షల కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. 2జి కుంభకోణం రూ.1.76 లక్షల కోట్లు అని, ఈ దోపిడీ అరికడితే విద్యాహక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయొచ్చని విశదీకరించారు. నిరక్షరాస్యతనేదే లేకుండా పోతుందన్నారు. ఎపిఎల్‌, బిపిఎల్‌తో సంబంధం లేకుండా అందరికీ ఆహార భద్రత కల్పించాలంటే ప్రతి కుటుంబానికీ నెలకు 35 కిలోల బియ్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. యుపిఎ-2 సర్కారు నిర్లక్ష్యం వల్ల ఆహార భద్రత బిల్లే ఇంకా రూపొందించలేదు.
                  ఆహార భద్రత కల్పించాలంటే ఏటా రూ.88 వేల కోట్లు ఖర్చవుతాయని కేంద్రం అంచనా. 2జి కుంభకోణాన్ని ఆపితే రెండేళ్లపాటు అందరికీ ఆహార భద్రత కల్పించే అవకాశముండేది. కానీ పాలకులు ప్రజల సొమ్మును దోచుకుతింటున్నారని ఆయన విమర్శించారు. భగత్‌సింగ్‌ రాజకీయ స్వాతంత్య్రంతోపాటు ఆర్థిక స్వాతంత్య్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. భగత్‌సింగ్‌ వారసత్వాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. మతం, కులం ఐక్యతను బలహీనపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ సమైక్యతకు ప్రమాదకరం. అందరికీ విద్య, ఉపాధి, ఆకలి చావులు లేని సమాజం కోసం ఉమ్మడిగా పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దోపిడీ, మతతత్వ రాజకీయాలను ఓడించడానికి వామపక్షాలతో కలిసి ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఈ దిశగా నూతన భారత దేశాన్ని నిర్మిస్తారని ఆకాంక్షిస్తున్నామని ఏచూరి ఆశాభావం వ్యక్తం చేశారు.
నయా ఉదారవాద విధానాల వ్యతిరేకంగా ఉద్యమం : బిజు
             కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు పికె బిజు పిలుపునిచ్చారు. నయా ఉదారవాద విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలు అవలంబించడం వల్ల విద్యావైద్యంతోపాటు వ్యవసాయం కూడా దెబ్బతింటోందని విమర్శించారు. 2జి కుంభకోణంలో ఇప్పటికే రాజాజీ, కనిమొళిజీ జైలుకు వెళ్లారని, భవిష్యత్తులో చిదంబరంజీ, మరోజీ తీహార్‌ జైలుకు వెళ్తారని చెప్పారు.

                     ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం ఛైర్మన్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎం గేయానంద్‌ , ఎస్‌ఎఫ్‌ఐ మాజీ అధ్యక్షులు వై వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె చంద్రమోహన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహాయ కార్యదర్శి శివదాసన్‌, మాజీ అధ్యక్షులు ఆర్‌.అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  
( ప్రజాశక్తి సౌజన్యంతో..... )  
 

Saturday, January 21, 2012

అందరికీ ఇక్కట్లు...

  • తృణమూల్‌ దుష్ట పాలన ఫలితం
  •  ప్రకాశ్‌ కరత్‌ విమర్శ
                   పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ 'దుష్ట పాలన' సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. ఈ నెల 17 నుంచి జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసిన అనంతరం శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పంటలను సేకరించడంలో బెంగాల్‌ సర్కారు వైఫల్యం కారణంగా అయినకాడికి అమ్ముకోవాల్సి రావడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గత లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేకరణ యంత్రాంగాన్ని తృణమూల్‌ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ ప్రాంతాల్లో ఉపాధి కల్పనలో వైఫల్యముందని తెలిపారు. తృణమూల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా స్తంభింపజేయడమే దీనికి ప్రధాన కారణమని కరత్‌ చెప్పారు. వాస్తవానికి అది పంచాయతీల పనిని నిలిపివేసిందన్నారు. 
                  మూతపడిన పరిశ్రమల్లోని కార్మికులను ఆదుకునేందుకు గత లెఫ్ట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ పథకాన్ని తృణమూల్‌ సర్కారు నిలిపివేయడం రాష్ట్రంలోని తేయాకు తోటల్లో ఆకలిచావులకు దారితీసిందని తెలిపారు. రాష్ట్రంలో సిపిఎం, ఇతర వామపక్షాలపై ఇప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, ప్రజాతంత్ర హక్కులు ప్రమాదంలో ఉన్నాయని వివరించారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఎలాంటి విమర్శలనూ సహించలేని స్థితిలో ఉన్నారన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌పై విజిలెన్స్‌ కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ కేరళలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం అత్యంత అవినీతిపరులైన మంత్రులతో నిండి ఉన్నదని, అటువంటి సర్కారు నిజాయితీకి మారుపేరైన ప్రతిపక్షనేతను అప్రతిష్టపాలుచేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ అంశంపై తాము కేరళ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల స్పందన ఎలావుంటుందో చూద్దామని కరత్‌ అన్నారు. ఏప్రిల్‌లో జరుగనున్న పార్టీ 20వ అఖిలభారత మహాసభల్లో ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన రాజకీయ తీర్మానం, కొన్ని సైద్ధాంతిక సమస్యలపై తీర్మానంపై పార్టీలో అన్ని స్థాయిల్లో రెండు నెలల పాటు విస్తృత చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ తీర్మానం ముసాయిదాలను ఈ నెల చివరి నాటికి అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు.
ప్రజాశక్తి సౌజన్యంతో.....   
 

Saturday, January 14, 2012

తెలుగుధనాని విరాజిల్లుతున్న తెలుగు వారందరికి.....

               ఈ సంక్రాంతి అందరి ఇళ్ళల్లోనూ సంతోషాల పంట పండించాలని,
 విశ్వవ్యాప్తంగా విస్తరిల్లి, తెలుగుధనాని    విరాజిల్లుతున్న తెలుగు వారందరికి
సంక్రాంతి పర్వదిన శుభాభినందనలతో.....వీరయ్య కే 

Friday, January 13, 2012

ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మిస్తాం


  • సినీ రంగంలో కమ్యూనిస్టులు, పిఎన్‌ఎం అద్వితీయ పాత్ర
  • అభ్యుదయం ఎక్కడున్నా ఆహ్వానించాల్సిందే
  • మహాసభల సీడీ ఆవిష్కరణ సభలో రాఘవులు
               సంగీత, సినీ, కళారంగాల్లో ప్రస్తుతమున్న స్థితికి భిన్నంగా ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ప్రజలను చీల్చి, వారిలో వైషమ్యాలు పెంచేందుకు ప్రస్తుత సాహిత్యం ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. తెలుగు సినీరంగంలో కమ్యూనిస్టులు, ప్రజానాట్యమండలి అద్వితీయ పాత్ర పోషించినట్లు తెలిపారు. ఈ రెండూ లేకపోతే సినిమా రంగమే లేదన్నారు. కేవలం కమ్యూనిస్టులనేగాకుండా అభ్యుదయ భావాలు ఎక్కడున్నా, ఎవరి దగ్గరున్నా, వాటిని ఆదరించి, అభిమానించాల్సిందేనని చెప్పారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ఖమ్మంలో జరిగే సిపిఎం 23వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకుని గురువారం స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఎత్తరా ఎర్రెర్రని పతాకం' అనే పాటల సిడి ఆవిష్కరణ సభ జరిగింది. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాఘవులు సిడిని ఆవిష్కరించారు. సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి శ్రీనివాస రావు, తెలంగాణ సాయుధ పోరాట యోధు రాలు మల్లు స్వరాజ్యం, ప్రముఖ సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్‌తేజ, చైతన్య ప్రసాద్‌, యాకూబ్‌, సంగీత దర్శకుడు యశోకృష్ణ, గాయకులు రాంకీ, లెనిన్‌, అరుణ్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.
                 ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ సాంస్కృతిక కళారంగాలు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దటంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. అభ్యుదయాన్ని ముందుకు తీసుకుపోయే సాహిత్యాన్ని ఆహ్వానిస్తామని, ఆదరిస్తామని తెలిపారు. గతంలో సినీరంగంలో పనిచేసిన పెద్దలు, అభ్యుదయకాముకులు సాహిత్య రంగంలో మహత్తరమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో వర్ధమాన రచయితలు, కవులు మతాలు, కులాలకు అతీతంగా మానవత్వం, సోదరతత్వం, సౌభ్రాతృత్వాలను రంగరించి పాటలు రాయాలని సూచించారు. వేర్వేరు
వృత్తుల్లో స్థిరపడినప్పటికీ ప్రజా ఉద్యమాల కోసం కొంతమంది రచయితలు తమ సమయాన్ని వెచ్చించి పాటలు రాయడం అభినందనీయ మన్నారు. వేర్వేరు రంగాల్లో ఉండటం వల్ల ప్రజా కళలకు దూరంగా ఉంటున్నామంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, అయితే ఏ రంగంలో ఉన్నప్పటికీ అవి మన ఆశయానికి అడ్డుకాబోవని తెలిపారు. తమ పార్టీ మహాసభ కేవలం గత నాలుగేళ్ళుగా చేసిన ఉద్యమాలు, భవిష్యత్‌ కార్యాచరణ, రాజకీయ చర్చలకే పరిమితంగాకుండా సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలనూ అంతర్భాగం చేస్తామని వివరించారు. మహాసభను పురస్కరించుకుని ఖమ్మంలో ఇప్పటికే వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిలో పలువురు రచయితలు, కవులు పాల్గొంటున్నారని చెప్పారు. మూడు రోజులపాటు ప్రతినిధుల సభ, ఫిబ్రవరి నాలుగో తేదీన లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు అగమ్యగోచరంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రజా సమస్యలు పక్కకు నెట్టబడ్డాయని విమర్శించారు. వీటిని తిరిగి రాజకీయ అజెండాలోకి తీసుకురావడంపై మహాసభల్లో చర్చిస్తామని రాఘవులు చెప్పారు. 
ప్రజాశక్తి సౌజన్యంతో.....   

Tuesday, January 10, 2012

ప్రజా సమస్యలే ఎజెండా

  • కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు
  • స్థానిక, పురపాలక ఎన్నికలు నిర్వహించాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు
సిపిఎం రాష్ట్ర మహాసభల్లో ప్రజాసమస్యలే ఎజెండాగా చర్చించనున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ముషిరాబాద్‌లోని శేఖర్‌నగర్‌ (ఖషీష్‌ ఫంక్షన్‌హాల్‌)లో జరుగుతున్న సిపిఎం నగర 19వ మహాసభలకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నిన్నటితో 23 జిల్లాల మహాసభలు పూర్తయ్యాయని, ఫిబ్రవరి 2-4 తేదీల్లో ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు, ఏప్రిల్‌లో కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌లో అఖిలభారత మహాసభలు జరగనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అయోమయంగా, అస్తవ్యస్తంగా ఉందన్నారు. కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు పరాకాష్టకు చేరాయన్నారు. జగన్‌ను బలహీనం చేయడానికి కాంగ్రెస్‌పార్టీ, కాంగ్రెస్‌ను బలహీనం చేయడానికి జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి నాటకంలా కనిపిస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ఫలహారాల ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉందన్నారు. రాష్ట్ర మహాసభల్లో రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలను చర్చించనున్నామని తెలిపారు. ప్రజాసమస్యలను రాజకీయ ఎజెండా చేయడమే మహాసభల లక్ష్యమన్నారు. వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించ నున్నామని తెలిపారు. హైదరాబాద్‌ మహానగరానికి కొత్తమేయర్‌ ఎన్నికయ్యారని, పురపాలక సంఘాలు, స్థానిక సంస్థల పాలకవర్గాలకు మాత్రం ఎన్నికలు నిర్వహించలేదని చెప్పారు.
         కాలపరిమితి ముగిసిన వెంటనే నిర్వహించాలని రాజ్యాంగంలో ఉన్నా రాజ్యాంగానికి విరుద్ధంగా అప్రజాస్వామికంగా కాంగ్రెస్‌పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. కోర్టు కేసు సాకుతో ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని, స్వార్థం కోసం, స్వలాభం కోసం కాంగ్రెస్‌పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అధికారులను ఆసరాగా చేసుకొని పన్నులు వేసి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సాకులు చెప్పకుండా తక్షణమే స్థానిక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పాలకవర్గాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని అన్నారు. ఇప్పటికే కొన్ని పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను, చెత్తపన్ను పెంచాయని, మరికొన్ని పురపాలక సంఘాల్లో ప్రతిపాదనలు పంపారని తెలిపారు. హైదరాబాద్‌లో నీటి పన్ను పెంచిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పన్నులు వేసి భారాలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా రూ.90 కోట్లు గ్రాంట్‌ ఇచ్చారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం వేసిన భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతోందని వివరించారు.

ప్రజాశక్తి సౌజన్యంతో.....  

Sunday, January 8, 2012

రాష్ట్ర కాంగ్రెస్‌కు శృంగభంగమే

  • సిపిఎం హైదరాబాద్‌ నగర మహాసభలో మధు
ప్రజాసమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో శృంగభంగం తప్పదని సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు పి మధు హెచ్చరించారు. హైదరాబాద్‌ 19వ నగర మహాసభలు శనివారం నాడు ప్రారంభమయ్యాయి. సభల ప్రారంభం సందర్భంగా గోల్కొండికాస్‌ రోడ్డు నగర కార్యాలయం నుంచి ముషీరాబాద్‌ పార్కు వరకు ర్యాలీ జరిగింది. అనంతరం ముషీరాబాద్‌ పార్కు వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సిపిఎం నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌.మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడుతూ.. 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అసమర్థ ముఖ్య మంత్రిని ఎక్కడా చూడలేదని కిరణ్‌కుమార్‌ రెడ్డి పాలనాతీరును నిశితంగా విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యాట్‌ పెంచి ప్రజలపై భారాలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరల తాకిడిలో ఓ వైపు ప్రజలు బతుకు భారమై అల్లాడుతుంటే మరోవైపు రకరకాల పన్నులు వేసి మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెంచడానికి సిద్ధమయ్యారన్నారు. కేబినెట్‌లో ఉన్న మంత్రులు బ్రాందీ, గుడుంబా, సిండికేట్‌ వ్యాపారాలు చేసుకుంటూ అవినీతిలో కూరుకు పోయారని విమర్శించారు. జగన్‌ అనుచర ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే తన పదవికి ఎసరు వస్తుందనే భయంతో కిరణ్‌కుమార్‌రెడ్డి కాలయాపన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.                    
                            సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సమస్యలు పరిష్కరించకపోగా భారాలేస్తోంద న్నారు. మరోవైపు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇది కోతల, వాతల ప్రభుత్వం తప్ప ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం కాదని విమర్శించారు. ప్రపంచబ్యాంకు ఆదేశాలు, సరళీకరణ విధానాలతో అవినీతి పాలక, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా కనివినీ ఎరుగుని రీతిలో పాకిపోయిందన్నారు. అసలు రాష్ట్ర మంత్రిపైనే దాడి జరిగితే రక్షించలేని పోలీసులు సిపిఎం ర్యాలీ అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ సుధాభాస్కర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల నేడు కార్మికవర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోం దన్నారు. ఫిబ్రవరి 28న జరిగే మరో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర నాయకులు టి.జ్యోతి మాట్లాడుతూ మహిళలపై హింసను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంద న్నారు. మహిళలను లక్షాధికా రులను చేస్తామని గొప్పలు చెప్పి చివరకు మైక్రోఫైనాన్స్‌ ఊబిలోకి తోసిందని విమర్శించారు. పౌరసమస్యలు, ఇళ్లు, ఇళ్ల సమస్యలు, అధికధరలు తదితర అనేక అంశాలపై సిపిఎం నిర్వహించిన పోరాటాలను పిఎస్‌ఎన్‌.మూర్తి గుర్తుచేశారు. ఆదివారం నుంచి జరిగే రెండురోజుల ప్రతినిధుల సభలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
     ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  ) 

Sunday, January 1, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

          మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయాభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...2012.
               ఈ కొత్త సంవత్సరం సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలి. 
మనిషిగా జీవితంలో ఎదిగేందుకు., వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు., పదుగురికీ సాయపడే బుద్దిని అలవరచుకునేందుకు., చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమను పంచేందుకు ఈ నూతన సంవత్సరం  సకల జనావళికి దోహదపడాలని., ప్రతి ఒక్కరి కలలు ఫలించి ఈ ఏడాది శుభప్రదం కావాలని కోరుకుంటూ .....