Friday, January 13, 2012

ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మిస్తాం


  • సినీ రంగంలో కమ్యూనిస్టులు, పిఎన్‌ఎం అద్వితీయ పాత్ర
  • అభ్యుదయం ఎక్కడున్నా ఆహ్వానించాల్సిందే
  • మహాసభల సీడీ ఆవిష్కరణ సభలో రాఘవులు
               సంగీత, సినీ, కళారంగాల్లో ప్రస్తుతమున్న స్థితికి భిన్నంగా ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ప్రజలను చీల్చి, వారిలో వైషమ్యాలు పెంచేందుకు ప్రస్తుత సాహిత్యం ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. తెలుగు సినీరంగంలో కమ్యూనిస్టులు, ప్రజానాట్యమండలి అద్వితీయ పాత్ర పోషించినట్లు తెలిపారు. ఈ రెండూ లేకపోతే సినిమా రంగమే లేదన్నారు. కేవలం కమ్యూనిస్టులనేగాకుండా అభ్యుదయ భావాలు ఎక్కడున్నా, ఎవరి దగ్గరున్నా, వాటిని ఆదరించి, అభిమానించాల్సిందేనని చెప్పారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ఖమ్మంలో జరిగే సిపిఎం 23వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకుని గురువారం స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఎత్తరా ఎర్రెర్రని పతాకం' అనే పాటల సిడి ఆవిష్కరణ సభ జరిగింది. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాఘవులు సిడిని ఆవిష్కరించారు. సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి శ్రీనివాస రావు, తెలంగాణ సాయుధ పోరాట యోధు రాలు మల్లు స్వరాజ్యం, ప్రముఖ సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్‌తేజ, చైతన్య ప్రసాద్‌, యాకూబ్‌, సంగీత దర్శకుడు యశోకృష్ణ, గాయకులు రాంకీ, లెనిన్‌, అరుణ్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.
                 ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ సాంస్కృతిక కళారంగాలు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దటంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. అభ్యుదయాన్ని ముందుకు తీసుకుపోయే సాహిత్యాన్ని ఆహ్వానిస్తామని, ఆదరిస్తామని తెలిపారు. గతంలో సినీరంగంలో పనిచేసిన పెద్దలు, అభ్యుదయకాముకులు సాహిత్య రంగంలో మహత్తరమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో వర్ధమాన రచయితలు, కవులు మతాలు, కులాలకు అతీతంగా మానవత్వం, సోదరతత్వం, సౌభ్రాతృత్వాలను రంగరించి పాటలు రాయాలని సూచించారు. వేర్వేరు
వృత్తుల్లో స్థిరపడినప్పటికీ ప్రజా ఉద్యమాల కోసం కొంతమంది రచయితలు తమ సమయాన్ని వెచ్చించి పాటలు రాయడం అభినందనీయ మన్నారు. వేర్వేరు రంగాల్లో ఉండటం వల్ల ప్రజా కళలకు దూరంగా ఉంటున్నామంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, అయితే ఏ రంగంలో ఉన్నప్పటికీ అవి మన ఆశయానికి అడ్డుకాబోవని తెలిపారు. తమ పార్టీ మహాసభ కేవలం గత నాలుగేళ్ళుగా చేసిన ఉద్యమాలు, భవిష్యత్‌ కార్యాచరణ, రాజకీయ చర్చలకే పరిమితంగాకుండా సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలనూ అంతర్భాగం చేస్తామని వివరించారు. మహాసభను పురస్కరించుకుని ఖమ్మంలో ఇప్పటికే వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిలో పలువురు రచయితలు, కవులు పాల్గొంటున్నారని చెప్పారు. మూడు రోజులపాటు ప్రతినిధుల సభ, ఫిబ్రవరి నాలుగో తేదీన లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు అగమ్యగోచరంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రజా సమస్యలు పక్కకు నెట్టబడ్డాయని విమర్శించారు. వీటిని తిరిగి రాజకీయ అజెండాలోకి తీసుకురావడంపై మహాసభల్లో చర్చిస్తామని రాఘవులు చెప్పారు. 
ప్రజాశక్తి సౌజన్యంతో.....   

No comments:

Post a Comment