Tuesday, January 10, 2012

ప్రజా సమస్యలే ఎజెండా

  • కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు
  • స్థానిక, పురపాలక ఎన్నికలు నిర్వహించాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు
సిపిఎం రాష్ట్ర మహాసభల్లో ప్రజాసమస్యలే ఎజెండాగా చర్చించనున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ముషిరాబాద్‌లోని శేఖర్‌నగర్‌ (ఖషీష్‌ ఫంక్షన్‌హాల్‌)లో జరుగుతున్న సిపిఎం నగర 19వ మహాసభలకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నిన్నటితో 23 జిల్లాల మహాసభలు పూర్తయ్యాయని, ఫిబ్రవరి 2-4 తేదీల్లో ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు, ఏప్రిల్‌లో కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌లో అఖిలభారత మహాసభలు జరగనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అయోమయంగా, అస్తవ్యస్తంగా ఉందన్నారు. కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు పరాకాష్టకు చేరాయన్నారు. జగన్‌ను బలహీనం చేయడానికి కాంగ్రెస్‌పార్టీ, కాంగ్రెస్‌ను బలహీనం చేయడానికి జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి నాటకంలా కనిపిస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ఫలహారాల ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉందన్నారు. రాష్ట్ర మహాసభల్లో రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలను చర్చించనున్నామని తెలిపారు. ప్రజాసమస్యలను రాజకీయ ఎజెండా చేయడమే మహాసభల లక్ష్యమన్నారు. వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించ నున్నామని తెలిపారు. హైదరాబాద్‌ మహానగరానికి కొత్తమేయర్‌ ఎన్నికయ్యారని, పురపాలక సంఘాలు, స్థానిక సంస్థల పాలకవర్గాలకు మాత్రం ఎన్నికలు నిర్వహించలేదని చెప్పారు.
         కాలపరిమితి ముగిసిన వెంటనే నిర్వహించాలని రాజ్యాంగంలో ఉన్నా రాజ్యాంగానికి విరుద్ధంగా అప్రజాస్వామికంగా కాంగ్రెస్‌పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. కోర్టు కేసు సాకుతో ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని, స్వార్థం కోసం, స్వలాభం కోసం కాంగ్రెస్‌పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అధికారులను ఆసరాగా చేసుకొని పన్నులు వేసి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సాకులు చెప్పకుండా తక్షణమే స్థానిక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పాలకవర్గాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని అన్నారు. ఇప్పటికే కొన్ని పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను, చెత్తపన్ను పెంచాయని, మరికొన్ని పురపాలక సంఘాల్లో ప్రతిపాదనలు పంపారని తెలిపారు. హైదరాబాద్‌లో నీటి పన్ను పెంచిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పన్నులు వేసి భారాలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా రూ.90 కోట్లు గ్రాంట్‌ ఇచ్చారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం వేసిన భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతోందని వివరించారు.

ప్రజాశక్తి సౌజన్యంతో.....  

No comments:

Post a Comment