Saturday, May 19, 2012

మహా మనిషి, ఆదర్శ జీవి...

ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు.
               నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1 న జన్మించాడు అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్‌ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత.   దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియంను ఆయన తీర్చిదిద్దారు.  సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు.  తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు . కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.
             ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నంత కాలం మన దేశ పార్లమెంటు లో సైకిల్ స్టాండు ఉండేది. పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్ మీదే వెళ్ళేవారు. ఆయనతో పాటే ఆ స్టాండు కు కాలం చెల్లింది.  రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిల్. ఆయన నిరాడంబర జీవితానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.  పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నారు. తండ్రినుంచి లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశారు. 1985 మే19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి.
                                    కులవ్యవస్థను నిరసించిన ఆయన తన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. "కామ్రేడ్ పి.ఎస్." అని ఈయనను పిలిచేవారు. మన దేశంలో పేదలు వర్గరీత్యానే గాక సామాజికంగా అణచివేయబడుతున్నారు.  ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ఈ సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని  ఆనాడే  సుందరయ్య గారూ   పిలుపునిచ్చారు.
                 సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సుందరయ్య బతికున్నంతకాలం సామాజికన్యాయం కోసం , పేద ప్రజల కోసమే పోరాడారు. పాలకుల విధానాలపై తిరుగుబాటు చేశారు. సోషలిజమనే నూతన సమాజం కోసం అహరహం శ్రమించారు.

     సుందరయ్య,   
    నీలాంటి త్యాగజీవులెందరయ్యా  ,    
    శ్రమజీవులు నిన్నెపుడూ మరువరయ్యా...
( నేడు మహా మనిషి  సుందరయ్య గారి  27వ వర్థంతి  సందర్బంగా  )

Sunday, May 6, 2012

నవ్వడం నలభై విధాలగ్రేట్‌ ...

నవ్వడం ఒక యోగం...నవ్వించడం ఒక భోగం...నవ్వలేకపోవడం ఒక రోగం...అని జంధ్యాల చెప్పిన మాటలు ఎన్ని తరాలు మారినా నిత్యసత్యాలే. అవును మరి నవ్వు అనేది ప్రతిమనిషిజీవితంలో అంతటి ప్రాముఖ్యతను సంపాదించుకుంది. నవ్వు నాలుగు విధాలచేటు అనే నానుడి కాస్తా నవ్వడం నలభైవిధాలగ్రేట్‌ అన్నవిధంగా మారిందంటే అతిశయోక్తికాదు. అందుకే నవ రసా ల్లో హస్యా నికి ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా లాఫింగ్‌ క్లబ్‌లు ఏర్పాటుచేయడమే కాకుండా ప్రతి సంవత్సరం మేనెల మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు మన హాస్య ప్రియులు.

            నవ్వుల క్లబ్‌ ఉద్యమం ప్రస్తుతం 65దేశాల్లో విస్తరించింది. ఆరోగ్యం ,ఆనందం, విశ్వశాంతికోసం జాతి మతాలకు అతీతంగా అనేక నగరాల్లోనూ, రెండవశ్రేణి పట్టణాల్లో సైతం నవ్వుల క్లబ్‌లు ఏర్పాటుచేస్తూ వారానికి ఒక్కరోజైనా కలిసి నవ్వుల్ని పంచుకుంటున్నారు. చిన్నా పెద్దా , ధనిక పేద, ఆడమగ తేడాలేకుండా అంతా కలిసి నవ్వుల పండుగ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పదికాలలపాటు నవ్వుల సాక్షిగా కాపాడుకుంటున్నారు. జాతిమతం, ప్రాంతం, దేశంతో సంబంధంలేకుండా ప్రతి మనిషికి అర్థమయ్యే భాష నవ్వు. మనకు తెలియకుండానే వచ్చే నవ్వు... మనం నవ్వాలన్నా ప్రయత్నించినా మనసారా నవ్వ డం లేదని ఇట్టే తెలిసిపోతుంది. ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి రోజుకు ఎన్ని సార్లు మన సారా నవ్వుతున్నాడో తెలుసుకుంటే చాలు.
            శరీరంలో సహజరోగ నిరోధకాలైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, ఆర్తరైటిస్‌, స్పాండు లైటిస్‌, మైగ్రిన్‌ వంటి వ్యాధులు దూరమవుతాయి. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువగా ఉన్న ఉద్యోగులు ఎక్కువ సామర్ధ్యంతో పనిచేస్తారని మరో అధ్యయనంలో స్పష్టమైంది.  హాయిగా నవ్వేలా చార్లీచాపీన్‌ సినిమా చూడండి. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పువ్వల్లే... నవ్వుల్‌...నవ్వుల్‌...అని హామింగ్‌ చేస్తూ ...నవ్వుతూ బతకండి...
( అంధ్ర ప్రభ  సౌజన్యంతో..... )

Saturday, May 5, 2012

కార్మికుల సుదీర్ఘ పోరాట ఫలం...

సోషలిజం దిశగా తొలి అడుగు : ఛావెజ్‌ 
వెనిజులాలో కొత్త కార్మిక చట్టం

                అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ సంతకం చేసిన నూతన సమగ్ర కార్మిక చట్టం వెనిజులాలో సోషలిజం దిశగా మార్పులో తొలి అడుగని ఆ దేశ ప్రభుత్వం అభివర్ణించింది. ఈ చారిత్రిక పత్రంపై సంతకాలు చేసిన సందర్భాన్ని జరుపుకునేందుకు మేడే రోజున వేలాది మంది రాజధాని వీధుల్లో ప్రదర్శన జరిపారు. 'దీర్ఘకాలిక ప్రతిఘటన, పోరాటం, ఇంకా చెప్పాలంటే ఇబ్బందుల క్రమం లేకుండా ప్రజలు, కార్మికులు ఎన్నడూ విజయం సాధించలేదు. ఇప్పుడు నేను సంతకం చేసే గౌరవాన్ని అందించిన ఈ చట్టం కూడా సుదీర్ఘ పోరాట క్రమం ఫలితమే' అని అధ్యక్షుడు ఛావెజ్‌ చెప్పారు. ఈ కొత్త చట్టం ప్రకారం పనిని వారంలో 40 గంటలకు తగ్గిస్తుంది. 1990ల నుంచి సాగిన నయా ఉదారవాద విధానాల దోపిడీ రూపంగా భావిస్తున్న దేశంలోని ప్రయివేటు సబ్‌ కాంట్రాక్టు లేబర్‌ను రద్దు చేస్తుంది. ప్రసవానంతర సెలవును 12 నుంచి 25 వారాలకు పెంచడం, బిడ్డ పుట్టిన అనంతరం రెండేళ్ళ పాటు డిస్మిస్‌ కాకుండా నూతన దంపతులను కాపాడటం ద్వారా పని ప్రదేశంలో జండర్‌ సమానత్వం దిశగా ఇది గొప్ప ముందడుగని మహిళా గ్రూపులు ఈ చట్టాన్ని ప్రశంసించాయి.
                 1997లో అప్పటి రఫాయెల్‌ కాల్డెరా ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, కార్పొరేట్‌ ప్రయోజనాల ఒత్తిడికి తలొగ్గి రద్దు చేసిన కొన్ని కార్మిక హక్కులను ఈ చట్టం తిరిగి కల్పిస్తుంది. ఈ చట్టాన్ని అనుసరించి కార్మికుడు చివరి నెలలో తీసుకున్న జీతాన్ని అతడు సేవలందించిన సంవత్సరాల సంఖ్యతో గుణించడం ద్వారా కార్మికుల రిటైర్మెంట్‌ బోనస్‌ను తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు ఎవరైనా కార్మికుడ్ని యజమాని అక్రమంగా తొలగిస్తే బోనస్‌గా రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 12 నెలల్లో అమలు చేయాల్సి ఉన్న ఈ కొత్త చట్టాన్ని యజమానులు ఏ మేరకు అమలు చేస్తున్నారనే విషయాన్ని పర్యవేక్షించేందుకు ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కార్మికులు రిటైరైన తరువాత తమ ప్రయోజనాలను ఒక ప్రయివేటు బ్యాంక్‌, ప్రభుత్వ బ్యాంక్‌ లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ రిటైర్మెంట్‌ నిధి ద్వారా తమకు ఏది ఇష్టమైతే అందులో ప్రాసెస్‌ చేసుకునేందుకు అవకాశముంది. ఛావెజ్‌ ఈ సంవత్సరం ప్రారంభంలో నెలవారీ కనీస వేతనాన్ని 32.5 శాతం పెంచుతూ ప్రకటించారు. దాన్ని రెండు దశలుగా అమలు చేస్తున్నారు. మొదటి దశ మే 1 నుంచి 1,548 బొలివార్ల నుంచి 1,780 బొలివార్ల పెంపుదలతో అమలులోకి వచ్చింది. సెప్టెంబర్‌లో 2,047 బొలివార్లలో 15 శాతం పెంపుదల వస్తుంది. ఈ నూతన చట్టం సోషలిజపు అత్యున్నత దశ నిర్మాణానికి సాధనమని విదేశాంగ మంత్రి నికొలస్‌ మదురా పేర్కొన్నారు. నాల్గింట ఒక వంతు మంది నిరుద్యోగులుగా ఉన్న స్పెయిన్‌లోని కార్మిక వ్యతిరేక చట్టాలకు ఇది పూర్తిగా భిన్నమైందని అన్నారు. వెనిజులా శాసన నిర్మాతలు దాదాపు మూడేళ్ల నుంచి కార్మిక సంస్కరణలపై చర్చిస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరిస్తానని ఛావెజ్‌ వాగ్దానం చేసిన గత నవంబర్‌ నుంచి అవి వేగం పుంజుకున్నాయి. 'దోపిడీతో కూడిన పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల నుంచి ఎలాంటి దోపిడీ లేని సోషలిస్టు ఉత్పత్తి సంబంధాల దిశగా కదలాలనే మా ఆకాంక్షను పునరుద్ఘాటిస్తున్నాం' అని వెనిజులా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పెడ్రో యూస్సే చెప్పారు. ఈ చట్టానికి 80 శాతం మంది వెనిజులా ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు అంతర్జాతీయ పోలింగ్‌ సంస్థ ఇంటర్నేషనల్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ వివరించింది. 
( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

Tuesday, May 1, 2012

ప్రపంచ చరిత్రలో మహా మనిషి ...


ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు. అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్‌ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత.

                 చరిత్ర పుటలను ఒక్కసారి తిరగవేస్తే పిఎస్‌ను కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరిగా అందరూ గుర్తుంచుకుంటారు. 1936లో ఆయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. అప్పుడు ఆయన వయసు 24 ఏళ్లు. అఖిల భారత స్థాయిలో సంఘటిత రూపాన్ని సంతరించుకున్న పార్టీకి ఇదే తొలి కేంద్ర కమిటీ. దక్షిణ భారతదేశంలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆ తరువాత సిపిఐ(ఎం) ఏర్పాటులో పిఎస్‌ ప్రధాన పాత్ర పోషించారు. 1964 సిపిఐ(ఎం) వ్యవస్థాపక మహాసభలో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 12 సంవత్సరాలపాటు పిఎస్‌ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. ఆ రకంగా సిద్ధాంతాన్ని ఆచరణతో జోడించి దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియంను ఆయన తీర్చిదిద్దారు. దాని కోసం ఆహరహం తపించారు. సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు.
                  మన దేశంలో పేదలు వర్గరీత్యానే గాక సామాజికంగా అణచివేయబడుతున్నారు. తన చిన్నతనంలోనే సుందరయ్య ఈవిషయాన్ని గ్రహించారు. ఊరుమ్మడి బావుల్లో దళితుల్ని నీరు తోడుకోనివ్వకపోవడం, అంటరానితనం, కూలీ వివక్ష, అగౌరవపర్చడం, ఆడవారితో నీచంగా మాట్లాడటం వంటి అనాగరిక పద్ధతుల్ని ఆయన ఈసడించుకున్నారు.  విద్యార్థిగా స్వగ్రామం అలగానిపాడులో సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.  ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ఈ సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని పిలుపునిచ్చారు.
                 సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సుందరయ్య బతికున్నంతకాలం సామాజికన్యాయం కోసం , పేద ప్రజల కోసమే పోరాడారు. పాలకుల విధానాలపై తిరుగుబాటు చేశారు. సోషలిజమనే నూతన సమాజం కోసం అహరహం శ్రమించారు. 
సుందరయ్య 
నీలాంటి త్యాగజీవు లెందరయ్యా        
శ్రమజీవులు నిన్నెపుడూ మరువరయ్యా...
( నేడు 
మహా మనిషి   జన్మదినం సందర్బంగా - 
2012 మే1 - ఇది పుచ్చలపల్లి సుందరయ్య శత జయంతి సంవత్సరం. )