Saturday, January 21, 2012

అందరికీ ఇక్కట్లు...

  • తృణమూల్‌ దుష్ట పాలన ఫలితం
  •  ప్రకాశ్‌ కరత్‌ విమర్శ
                   పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ 'దుష్ట పాలన' సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. ఈ నెల 17 నుంచి జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసిన అనంతరం శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పంటలను సేకరించడంలో బెంగాల్‌ సర్కారు వైఫల్యం కారణంగా అయినకాడికి అమ్ముకోవాల్సి రావడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గత లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేకరణ యంత్రాంగాన్ని తృణమూల్‌ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ ప్రాంతాల్లో ఉపాధి కల్పనలో వైఫల్యముందని తెలిపారు. తృణమూల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా స్తంభింపజేయడమే దీనికి ప్రధాన కారణమని కరత్‌ చెప్పారు. వాస్తవానికి అది పంచాయతీల పనిని నిలిపివేసిందన్నారు. 
                  మూతపడిన పరిశ్రమల్లోని కార్మికులను ఆదుకునేందుకు గత లెఫ్ట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ పథకాన్ని తృణమూల్‌ సర్కారు నిలిపివేయడం రాష్ట్రంలోని తేయాకు తోటల్లో ఆకలిచావులకు దారితీసిందని తెలిపారు. రాష్ట్రంలో సిపిఎం, ఇతర వామపక్షాలపై ఇప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, ప్రజాతంత్ర హక్కులు ప్రమాదంలో ఉన్నాయని వివరించారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఎలాంటి విమర్శలనూ సహించలేని స్థితిలో ఉన్నారన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌పై విజిలెన్స్‌ కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ కేరళలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం అత్యంత అవినీతిపరులైన మంత్రులతో నిండి ఉన్నదని, అటువంటి సర్కారు నిజాయితీకి మారుపేరైన ప్రతిపక్షనేతను అప్రతిష్టపాలుచేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ అంశంపై తాము కేరళ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల స్పందన ఎలావుంటుందో చూద్దామని కరత్‌ అన్నారు. ఏప్రిల్‌లో జరుగనున్న పార్టీ 20వ అఖిలభారత మహాసభల్లో ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన రాజకీయ తీర్మానం, కొన్ని సైద్ధాంతిక సమస్యలపై తీర్మానంపై పార్టీలో అన్ని స్థాయిల్లో రెండు నెలల పాటు విస్తృత చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ తీర్మానం ముసాయిదాలను ఈ నెల చివరి నాటికి అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు.
ప్రజాశక్తి సౌజన్యంతో.....   
 

No comments:

Post a Comment