Tuesday, January 24, 2012

నవ భారతం నిర్మిద్దాం...

నవ భారతం నిర్మిద్దాం

  • విద్యార్థులు, యువతకు పిలుపు
  • భగత్‌సింగ్‌ వారసత్వాన్ని బలపర్చాలి
  • ఎస్‌ఎఫ్‌ఐ బహిరంగసభలో సీతారాం ఏచూరి
                 నూతన భారతదేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత విద్యార్థులూ, యువతపై ఉందని ఉమ్మడి ఉద్యమాలతోనే అది సాధ్యమవుతుందని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ 19వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సోమవారం కడపలో మున్సిపల్‌ క్రీడా ప్రాంగణం నుంచి పాత బస్టాండు వరకు విద్యార్థులు మహా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం సూర్యారావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఏచూరి మాట్లాడుతూ కేంద్రంలోని యుపిఎ-2 ప్రభుత్వం దోపిడీ, దౌర్జన్య విధానాలను అవలంబిస్తోందని సోదాహరణంగా వివరించారు. ఈ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా విద్యారి ్థలోకం పోరాడాలని కోరారు. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం తీవ్రమైందనీ, వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా 1500 పట్టణాలకు వ్యాపించిన విషయాన్ని ఏచూరి ప్రస్తావిస్తూ మునుముందు పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు విస్తృతమౌతాయని తెలిపారు. దోపిడీ, దౌర్జన్యాలు లేకుండా పెట్టుబడిదారీ విధానం బతకలేదనీ, అందుచేత దానికి ప్రత్యామ్నాయం సోష లిజం తప్ప మరోటి లేదన్నారు. ప్రపంచంలో వస్తున్న పోరాటాలను అధ్యయనం చేయాలి... ఆ అవగాహనతో మన దేశ పరిస్థి తులను మార్చాలని కోరారు. నూతన భారత దేశాన్ని నిర్మించాలని ఏచూరి అన్నారు.
             దేశంలో నూటికి తొమ్మిది మంది మాత్రమే ఉన్నత విద్యకు చేరుకుంటున్నారని, అది 25 నుంచి 30 శాతానికి పెరిగితే ప్రపంచానికే నాయకత్వం వహించే సామర్థ్యం భారతీయులకూ ఉంటుంద న్నారు. విద్య అందించే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయని అన్నారు. 6-14 ఏళ్లలోపు పిల్లలందరికీ విద్య అందించాలని విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే విద్యతోపాటు, మధ్యాహ్న భోజనం, యూనిఫారమ్స్‌, ఉచితంగా పుస్తకాలు, పాఠశాలల భవనాలు, ఉపాధ్యాయుల నియామకాలు చేయాలనీ చట్టంలో ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లవు తున్నా నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరలేదన్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడానికి ఏటా రూ.35వేల కోట్లు ఖర్చవుతాయని ప్రణాళికా సంఘం అంచనా వేసిందన్నారు. ఐదేళ్లపాటు అమలు చేస్తే రూ.1.75 లక్షల కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. 2జి కుంభకోణం రూ.1.76 లక్షల కోట్లు అని, ఈ దోపిడీ అరికడితే విద్యాహక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయొచ్చని విశదీకరించారు. నిరక్షరాస్యతనేదే లేకుండా పోతుందన్నారు. ఎపిఎల్‌, బిపిఎల్‌తో సంబంధం లేకుండా అందరికీ ఆహార భద్రత కల్పించాలంటే ప్రతి కుటుంబానికీ నెలకు 35 కిలోల బియ్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. యుపిఎ-2 సర్కారు నిర్లక్ష్యం వల్ల ఆహార భద్రత బిల్లే ఇంకా రూపొందించలేదు.
                  ఆహార భద్రత కల్పించాలంటే ఏటా రూ.88 వేల కోట్లు ఖర్చవుతాయని కేంద్రం అంచనా. 2జి కుంభకోణాన్ని ఆపితే రెండేళ్లపాటు అందరికీ ఆహార భద్రత కల్పించే అవకాశముండేది. కానీ పాలకులు ప్రజల సొమ్మును దోచుకుతింటున్నారని ఆయన విమర్శించారు. భగత్‌సింగ్‌ రాజకీయ స్వాతంత్య్రంతోపాటు ఆర్థిక స్వాతంత్య్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. భగత్‌సింగ్‌ వారసత్వాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. మతం, కులం ఐక్యతను బలహీనపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ సమైక్యతకు ప్రమాదకరం. అందరికీ విద్య, ఉపాధి, ఆకలి చావులు లేని సమాజం కోసం ఉమ్మడిగా పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దోపిడీ, మతతత్వ రాజకీయాలను ఓడించడానికి వామపక్షాలతో కలిసి ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఈ దిశగా నూతన భారత దేశాన్ని నిర్మిస్తారని ఆకాంక్షిస్తున్నామని ఏచూరి ఆశాభావం వ్యక్తం చేశారు.
నయా ఉదారవాద విధానాల వ్యతిరేకంగా ఉద్యమం : బిజు
             కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు పికె బిజు పిలుపునిచ్చారు. నయా ఉదారవాద విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలు అవలంబించడం వల్ల విద్యావైద్యంతోపాటు వ్యవసాయం కూడా దెబ్బతింటోందని విమర్శించారు. 2జి కుంభకోణంలో ఇప్పటికే రాజాజీ, కనిమొళిజీ జైలుకు వెళ్లారని, భవిష్యత్తులో చిదంబరంజీ, మరోజీ తీహార్‌ జైలుకు వెళ్తారని చెప్పారు.

                     ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం ఛైర్మన్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎం గేయానంద్‌ , ఎస్‌ఎఫ్‌ఐ మాజీ అధ్యక్షులు వై వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె చంద్రమోహన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహాయ కార్యదర్శి శివదాసన్‌, మాజీ అధ్యక్షులు ఆర్‌.అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  
( ప్రజాశక్తి సౌజన్యంతో..... )  
 

No comments:

Post a Comment