Saturday, April 14, 2012

కార్టూన్‌ వేయడం నేరమా?




పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ సర్కార్‌ మరో అప్రజాస్వామిక చర్యకు పాల్పడింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర రైల్వే మంత్రి ముకుల్‌రారు, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్‌ త్రివేదిపై వ్యంగ్య కార్టూన్‌ వేసిన జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ అంబికేష్‌ మహాపాత్రపై సైబర్‌ నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసింది. అంతకు ముందు ప్రొఫెసర్‌పై తృణమూల్‌ గూండాలు దాడి చేసి విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. తృణమూల్‌ గూండాలు దాడి చేసి వెళ్లగానే పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం.
                 కార్టూన్‌ వేసి సామాజిక నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లలో ఉంచిన ప్రొఫెసర్‌ను అరెస్టు చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకునే హక్కు కూడా పౌరులకు లేదా. ప్రభుత్యాధినేతలకు వ్యతిరేకంగా ప్రతిదినం దినపత్రికల్లో వ్యంగ్య కార్టూన్లు వస్తున్న విషయాన్ని ఉదహరిస్తున్న నెటిజన్లు, ఈ అరెస్టుతో బెంగాల్‌ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. పలు అంశాలు, వ్యక్తులు, విధానాలు, తదితర ప్రతి అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించడం, చర్చించడం సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లలో సర్వ సాధారణం. సృజనాత్మకత ఉన్న ఎంతో మంది సామాజిక వెబ్‌సైట్ల ద్వారా వ్యంగ్య కార్టూన్లు, పేరడీ గేయాలు, పాటలు, వీడియోలను ఉంచుతూ తమ ప్రతిభను ప్రదర్శించుకుంటున్నారు.
               ప్రధాని మన్మోహన్‌, కేంద్ర మంత్రులు, ఇతర దేశాల నేతలపై కూడా ఎన్నో వ్యంగ్య కార్టూన్‌లు మనకు వెబ్‌సైట్లలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే అన్ని రకాల స్వేచ్ఛలనూ హరించి వేయడమే లక్ష్యంగా ఇటీవల కాలంలో నిర్ణయాలు తీసుకుంటున్న మమతా సర్కారుకు తమ సిఎంపై వ్యంగ్య కార్టూన్‌ వేయడం కోపం తెప్పించింది. అంతే, ఆఘమేఘాల మీద సైబర్‌ చట్టాల కింద కేసు నమోదు, అరెస్ట్‌ కూడా జరిగిపోయింది. మహిళలపై అత్యాచారాలు, హత్య కేసుల్లోనూ, ఇతర తీవ్ర సంఘటనల్లోనూ ప్రజల నుంచి డిమాండ్‌ వచ్చే వరకూ ఏనాడూ స్పందించని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేసు నమోదు నుంచి అరెస్ట్‌ వరకూ అన్ని కార్యక్రమాలూ ఒక్క రోజులోనే చేపట్టడం గమనార్హం.
              సినీ దర్శకుడు మృణాల్‌ సేన్‌, చిత్రకారుడు వసీం కపూర్‌, సాంస్కృతిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సర్కారు తీరును తప్పుపట్టారు. ప్రొఫెసర్‌పై సైబర్‌ నేరాలు మోపడం పూర్తి అన్యాయమని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. తమ ప్రొఫెసర్‌ అరెస్టుకు నిరసనగా జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ విద్యార్థులు వర్శిటీ ప్రాంగణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఫాసిస్టు ధోరణిని అవలంబిస్తోందని, చిన్నపాటి విమర్శను కూడా సహించలేక పోతోందని అందరు విమర్శించారు. 
 ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

No comments:

Post a Comment