Saturday, March 23, 2013

యువతకు ఆయన స్ఫూర్తి... ఉత్తేజం...


అసమాన దేశ భక్తులు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వేగుచుక్కలైన 
భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ లు.

.... మీ రక్తం వృద కాదు... మీ అశయలను సాధిస్తాం....

వారి దేశభక్తి, త్యాగ నిరతి యువతకు ఎప్పుడూ స్ఫూర్తి నిస్తూనే ఉంటుంది. 

'షహీద్‌ భగత్‌సింగ్‌ పేరే యువతకు ఉత్తేజం. 
ఆయన స్ఫూర్తి
 పోరాట సంప్రదాయాలకో సంకేతం. 
త్యాగం ఆదర్శానికి నిదర్శనం.
 మూయించిన ఒక వీరుని కంఠం వేయిగొంతుకల విప్లవ శంఖం
              
                     అన్న మహాకవి ఆవేదనను భగభగమండే అగ్నికణం లాంటి భగత్‌సింగ్‌ నిస్వార్థ పోరాట సంప్రదాయాలతో పోల్చడం సమంజసంగా ఉంటుంది. లాహోరు జైల్లో 1931 మార్చి 23న సంధ్యా సమయంలో స్వాతంత్య్రం కావాలి, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, విప్లవం వర్థిల్లాలిః, తెల్లదొరతనం పోవాలి, అన్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. కోట్లాది భారతీయుల హృదయాల్లో ఆరని జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతాడని ఎవరు ఊహింలేదు.

                         1928 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు ఆర్థిక సంక్షోభం నీలినీడలు భారతదేశంపై కూడా పడ్డాయి. దేశమంతా పెద్ద పెద్ద పోరాటాలు, సమ్మెలు జరిగాయి. సరిగ్గా ఇదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఢిల్లీలో అన్ని ప్రాంతాలకు చెందిన విప్లవకారులను సమావేశపరిచి, హిందూస్థాన్‌ సోషలిస్టు ప్రజాతంత్ర సంఘం అనే సంస్థను ఏర్పరిచారు భగత్‌సింగ్‌.  సోషలిజమే పార్టీ లక్ష్యంగా నిర్ణయించారు. పరిస్థితులు త్వరితగతిన మార్పు చెందుతున్నాయి. సైమన్‌ కమిషన్‌ గోబ్యాక్‌ అనే నినాదాలు నిప్పురవ్వల్లా బ్రిటిష్‌ వారిని దహించి వేస్తున్నాయి. దాన్ని సహించలేని వారు పంజాబ్‌ సింహం లాలా లజపతిరాయ్‌ని బలి తీసుకున్నారు. కార్మిక వర్గం వర్థిల్లాలిః, సామ్రాజ్యవాదం నశించాలిః, సోషలిజం వర్థిల్లాలిః, విప్లవం వర్థిల్లాలిః, అంటూ వారు చేసిన నినాదాలతో పార్లమెంటు హాలంతా మారుమ్రోగిపోయింది. ఎవరినో ఒకర్ని చంపేందుకు బాంబులు ఉపయోగించ లేదు. కేవలం చెవిటివాడిగా నటిస్తున్న ప్రభుత్వానికి ప్రజాఘోష వినిపించేందుకు మాత్రమే ఆ చర్య చేపట్టాల్సి వచ్చిందని భగత్‌సింగ్‌ వివరణ ఇచ్చారు.

                 కోర్టులో విచారణ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే భగత్‌సింగ్‌తో పాటు రాజగురు, సుఖదేవ్‌లకు కూడా ఉరిశిక్షను విధించారు. కోర్టును తమ భావాల ప్రచారానికి వేదికగా ఉపయోగించుకోవాలనుకున్న భగత్‌ సహచరుల కోరిక నెరవేరింది. పరాయి ప్రభుత్వం తన రాక్షస కబంధ హస్తాలతో వజ్రాల్లాంటి ముగ్గురు విప్లవవీరుల్ని సజీవంగా సమాధి చేసేందుకు ముహూర్తం నిర్ణయించింది. 1931 మార్చి 23న లాహోర్‌ జైల్లో టైప్‌మిషన్లు అధికారుల ఆదేశాలను టకటకమంటూ కొడుతున్నాయి. లాహోర్‌ జైల్లో చీకట్లు అంతటా వ్యాపించాయి.  ఇక జీవితంలో భగత్‌సింగ్‌ను చూడబోముః అనే భావన తోటి విప్లవకారుల చేత కన్నీరు పెట్టించింది. భావావేశపరుడయ్యే సమయం ఇంకా రాలేదు శివవర్మ. నేను కొన్ని రోజుల్లోనే అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతాను. కానీ మీరు దీర్ఘప్రయాణం చేయవలసి ఉంది. బాధ్యత అనే పెద్ద బరువును మోయవలసి వున్నప్పటికీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో నీవు అలసిపోవనీ, ధైర్యం కోల్పోవనీ, ఓటమి స్వీకరించి చతికిలబడిపోవని నా గట్టి నమ్మకం, అంటూ స్నేహితుడికి సందేశం ఇచ్చాడు భగత్‌సింగ్‌. 
                 ఆ కర్తవ్య దిశగా నేటి విద్యార్ధి, యువత భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులవటమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.


          భారత స్వాతంత్య్ర సమరంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ లు అమరులైనారు. ఆ యోధులకు వందనాలు.

         భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ల 82వ వర్ధంతి ( మార్చి 23) సందర్భంగా... 

No comments:

Post a Comment