Saturday, March 10, 2012

మిస్టర్‌ డిపెండబుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు ...


             మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం మీడియా సమావేశంలో ద్రవిడ్‌ ఈ విషయాన్ని ప్రకటించాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ 16 ఏళ్లపాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ద్రవిడ్‌ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. ది వాల్‌, మిస్టర్‌ డిపెండబుల్‌గా పేరొందిన ద్రవిడ్‌ భారత క్రికెట్‌కు అందించిన సేవలు వర్ణించలేనివి.
                   164 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ద్రవిడ్‌ 52.31 సగటుతో 13,288 పరుగులు సాధించాడు. ఇందులో 36 శతకాలు, 63 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 210 క్యాచ్‌లను పట్టి అత్యధిక క్యాచ్‌లను పట్టిన క్రికెటర్‌గా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు. దీంతోపాటు 25 టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీనిలో భారత్‌ 8 మ్యాచుల్లో విజయం సాధించగా, ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. మరో 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. వన్డేల్లో కూడా ద్రవిడ్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం 344 మ్యాచ్‌లు ఆడిన దివాల్‌ 39.16 సగటుతో 10,889 పరుగులు సాధించాడు. వీటిలో 12 శతకాలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  ద్రవిడ్‌ 196 క్యాచ్‌లను కూడా పట్టాడు. సమకాలిన క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఖ్యాతి గడించిన ద్రవిడ్‌ భారత్‌ క్రికెట్‌ అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. ఉత్తమ టెక్నిక్‌తో భారత ఇన్నింగ్స్‌కు పెట్టని గోడగా నిలిచే ద్రావిడ్‌ను పెవిలియన్‌కు పంపడానికి ఉద్ధండ బౌలర్లు కూడా అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.  క్లిష్ట సమయంలోనూ నిబ్బరంగా ఆడే సత్తా ఒక్క ద్రవిడ్‌కే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విదేశి గడ్డపై అద్భుత రికార్డు కలిగిన ద్రవిడ్‌ భారత్‌కు ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు.కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హైదరాబాదీ వివిఎస్. లక్ష్మణ్‌తో కలిసి నెలకొల్పిన రికార్డు భాగస్వామ్యం క్రికెట్‌ చరిత్రలోనే అత్యద్భుత ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

           ప్రపంచ క్రికెట్‌లో ద్రవిడ్‌ అద్భుత ఆటగాడు. ఆటగాడిగా ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేయడం దాదాపు అసాధ్యము.  భారత్‌కు లభించిన ఆణిముత్యాల్లో ద్రవిడ్‌ ఒకడు. సుదీర్ఘ కెరీర్‌లో ద్రవిడ్‌ సాగించిన ప్రస్థానం, భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టిన ఘనత ద్రవిడ్‌కే దక్కుతుంది.

No comments:

Post a Comment