Thursday, March 8, 2012

ఆకాశంలో సగం ...


నేడు 102 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

               మహిళా దినోత్సవాలెన్ని జరుపుకున్నా ఆకాశంలో సగ భాగంగా ఉన్న మహిళల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రాలేదు. అసమానత, అణచివేత, దోపిడీ అంతంకాలేదు. గత రెండు దశాబ్దాలుగా పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు, పెంచిపోషిస్తున్న వినిమయ, వినోద సంస్కృతి మహిళలను కడగండ్లపాల్జేస్తున్నాయి. సామాజిక, ఆర్థిక పరంగా మహిళలపై దాడులకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ విధంగా స్త్రీ అస్తిత్వానికే ఇవి సవాల్‌గా పరిణమించాయి. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, మత ఛాందసవాదం సాగిస్తున్న ఈ ముప్పేట దాడికి ప్రతిఘటన కూడా పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు తమ అస్థిత్వం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మహిళా దినోత్సవం నాడు దోపిడీ, అణచివేత, హింస, అసమానతల నుండి విముక్తి కోసం శ్రామిక మహిళలు పోరాడి రక్తతర్పణ చేసిన చారిత్రాత్మక రోజు అయిన ఈ మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరముంది. మహిళ ఉద్యమాలకు దిక్చూచి. 

                చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే చట్టం పట్ల బోలెడు శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తూనే మోకాలడ్డుతున్నారందరూ. వామపక్షాలు మాత్రమే దీనికి మినహాయింపు. కేరళలో సిపిఎం ఆధ్వర్యంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థలో 50శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. అలాగే చట్ట సభల్లో మహిళలరిజర్వేషన్ల బిల్లుకు వామపక్షాలు సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించినా సోనియా గాంధీ నాయకత్వంలోని యుపిఏ సర్కార్‌ 'ఏకాభిప్రాయం కోసం' అంటూ లోక్‌సభలో పెట్టకుండా వాయిదాలు వేస్తున్నది. 

           అంతర్జాతీయ మహిళా దినోత్సవం  ( మార్చి 8)

No comments:

Post a Comment