Saturday, February 11, 2012

ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతిపై వామపక్షాలే పోరాడుతున్నాయి - ప్రకాశ్‌ కరత్‌

  • సిపిఎం కేరళ రాష్ట్ర మహాసభల ముగింపు సభలో కరత్‌
  • తిరువనంతపురంలో రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల భారీ కవాతు
  • కార్యదర్శిగా పినరయి తిరిగి ఎన్నిక
             సిపిఎం కేరళ రాష్ట్ర మహాసభల ముగింపు ఈ సందర్భంగా సభకు ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ మాట్లాడుతూ... దేశంలో ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతిపై పోరాడుతోంది వామపక్షాలు మాత్రమేనని చెప్పారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తించారన్నారు. లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు సిపిఎం చొరవ తీసుకుంటుందని చెప్పారు. మూడేళ్ల యుపిఎ-2 పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగిత తీవ్రమైందని విమర్శించారు. ప్రజావ్యతిరేక నయా ఉదారవాద విధానాల వల్ల వేలాది మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జనవరిలోనే 160 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. కేరళలో రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమయ్యాయని, ఊమెన్‌చాందీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 31 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని అన్నారు. 34 ఏళ్ల వామపక్ష ప్రభుత్వంలో బెంగాల్‌లో ఎన్నడూ వినని రైతు ఆత్మహత్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయని, మమతా బెనర్జీ అధికారం చేపట్టాక ముడు పదులకు పైగా అన్నదాతలు బలయ్యారని అన్నారు. అనంతరం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌, కొడియేరి బాలకృష్ణన్‌, పినరయి విజయన్‌, సిపిఎం శాసన సభాపక్ష నేత విఎస్‌ అచ్యుతానందన్‌, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కడకంపల్లి సురేంద్రన్‌ ప్రసంగించారు.
                      సిపిఐ(ఎం) కేరళ రాష్ట్ర 20వ మహాసభలు శుక్రవారం తిరువనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభతో ముగిశాయి. ముగింపు సందర్భంగా అశేష జనవాహినితో నిర్వహించిన భారీ ర్యాలీతో రాజధాని నగరం తిరువనంతపురం ఎర్ర సముద్రాన్ని తలపించింది. దాదాపుగా 3 లక్షల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ఐదు ప్రధాన రోడ్ల గుండా సాగిన ఈ ర్యాలీలో 25 వేల మంది రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆద్యంతం అత్యంత క్రమశిక్షణతో సాగి, కమ్యూనిస్టు ఉద్యమ బలాన్ని చాటిన ఈ ర్యాలీలు ఇ బాలానందన్‌ నగర్‌ (చంద్రశేఖరన్‌ నాయర్‌ స్టేడియం)లో కలిశాయి. రైతులు, వివిధ రంగాల కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువజనులు, విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
( ప్రజాశక్తి సౌజన్యంతో..... ) 

No comments:

Post a Comment