Tuesday, February 28, 2012

భారత్ సంచలన విజయం...


36.4 ఓవర్లలో 321 లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా
లంకపై 7 వికెట్ల తేడాతో గెలుపు

     ముక్కోణపు సిరీస్ వన్డేలో భారత్-శ్రీలంక మధ్య మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో ఇండియా 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ టూర్‌లో ఇండియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు లంకపై విజయం సాధించి, ఫైనల్‌కు ఆశలు సజీవంగా ఉంచుకోవడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. కాగా టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

         అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ సంగక్కర పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లకు చెమటలు పట్టించారు. జయవర్ధనే : 22, దిల్షాన్ (నాటౌట్) : 160, సంగక్కర : 105, పెర్రారా : 3, మేథౌస్ : 14, ఛండిమల్ (నాటౌట్) : 2

         విమర్శకుల మాటలకు తన అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టు సమాధానం చెప్పింది. ఫైనల్‌కు చేరాలంటే బోనస్ పాయింట్‌తో గెలవాల్సిన తరుణంలో శ్రీలంకతో జరిగిన కీలక వన్డేలో భారత్ అద్భుత ఆటతీరు ప్రదర్శించి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ వెనక్కి చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత జట్టు బోనస్ పాయింట్‌తో సహా 15 పాయింట్లు పొంది ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

No comments:

Post a Comment