Wednesday, February 15, 2012

పేదలకు నీటి చుక్క లేన్నట్లెనా...?

                  తిండి దొరక్కపోతే కనీసం నీళ్లు తాగి బతికే పేదలకు ఇక అవి కూడా ఉచితంగా దొరకని దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయి. దేశంలో కలుషిత నీటిని తాగడం వల్ల జరిగే మరణాలే ఎక్కువ. ఇలాంటి అనుభవాలు ముందుండగానే కేంద్రం కొత్త జల విధానంలో  ప్రజలపై, రైతులపై భారాలు మోపడానికి ఎలాంటి జంకు లేకుండా సిద్ధమైందని అర్థమవుతుంది. నగరాలు, పట్టణాల్లో విషమ షరతులు విధించి పన్నులతో ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు.

                   మనిషికి ప్రాణాధారమైన నీటిని ప్రైవేటీకరించి వ్యాపార సరుకుగా మార్చడం నుండి మరెన్నో వినాశకర అంశాలు కొత్త జల విధాన ముసాయిదాలో చోటు చేసుకున్నాయని,  నీటి పంపిణీ సేవల ప్రైవేటీకరణ జల విధానంలో ప్రధానాంశమని వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండబోదు. నీటిని ప్రైవేటీకరిస్తే చుక్క చుక్కను లెక్కగట్టి ధరలు నిర్ణయించి రైతులు, ఇతర వినియోగదారుల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. అంతే కాదు నిర్వహణ, పాలనా పరమైన ఖర్చుల మొత్తాన్నీ నీటిని వాడుకునే వారి నుండి ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా రాబడతారు.


          ఒక్క మాటలో చెప్పాలంటే నీటి పంపణీ బాధ్యత నుండి ప్రభుత్వం వైదొలుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన నీటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా మొత్తంగా ఆ రంగం నుండి వైదొలగడం గర్హనీయం.
 

No comments:

Post a Comment