Friday, February 3, 2012

కాజేసింది కక్కించాలి - ప్రకాశ్‌ కరత్‌

  • 2జిపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
  • రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం
  • బెంగాల్‌దీ అదే దారి
  • వామపక్ష ప్రజాతంత్రమే ప్రత్యామ్నాయం
  • సిపిఎం రాష్ట్ర మహాసభ ప్రారంభ సభలో ప్రకాశ్‌ కరత్‌
             కార్పొరేట్‌ అవినీతికారణంగా దేశం నఫ్టపోయిన మొత్తాన్ని ఆ సంస్థల నుండి వసూలు చేయాలని సిపిఎం ప్రధానకార్యదర్శి ప్రకాశ్‌కరత్‌ డిమాండ్‌ చేశారు.  ఖమ్మంలో సిపిఎం 23వ రాష్ట్ర మహాసభలను ప్రకాష్‌ కరత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడ్డ కార్పొరేట్‌ సంస్థలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. 2జి కుంభకోణంలో అక్రమాలకు పాల్పడ్డ కార్పొరేట్‌ సంస్థల లైసెన్స్‌లు రద్దు చేయాలంటూ ఇచ్చిన తీర్పును చారిత్రాత్మకమైనదిగా ఆయన అభివర్ణించారు. వాస్తవానికి సిపిఎం మొదటి నుండి డిమాండ్‌ చేస్తోందని చెప్పారు. 2జి స్పెక్ట్రమ్‌ కంభకోణంలో122 సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలని తాము కోరినట్లుచెప్పారు. ట్రారుకూడా73 సంస్థల లైసెన్స్‌లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిందని తెలిపారు. అయితే, కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ ఈ సూచనను తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. లైసెన్స్‌లు రద్దు చేస్తే కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుందని, పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావని వాదించారని తెలిపారు. ఈ తరహా అవినీతిని దృష్టిలో ఉంచుకునే లోక్‌పాల్‌ పరిధిలోకి కార్పొరేట్‌ సంస్థలను తీసుకురావాలని తాము డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం రూపొందించిన లోక్‌పాల్‌ బిల్లు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు. లోక్‌పాల్‌ తోనే అవినీతిమొత్తం అంతమౌతుందన్న అభిప్రాయం కూడా సరికాదని చెప్పారు.

 



                  దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రైతాంగ ఆత్మహత్యలను ప్రకాశ్‌ కరత్‌ ప్రస్తావించారు. 1995 నుండి 2006 వ సంవత్సరం వరకు 2.56 లక్షలమంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.రైతాంగ ఆత్మహత్యల పరంపరలో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉందని అన్నారు.ఒక్క జనవరి నెలలోనే రాష్ట్రంలో 160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలు చోటుచేసుకోలేదని, అయితే ప్రస్తుతం అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. గత మూడు వారాల కాలంలో 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలే కారణమన్నారు, పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జి ప్రభుత్వం ధాన్యం సేకరణ యంత్రాంగాన్ని ధ్వంసం చేసిందని చెప్పారు. అయితే, ఈ విధానాలకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ రైతాంగం సంఘటితమవుతున్నారన్నారు.కార్మికవర్గంతో కలిసి పోరాటాలకు సిద్దమౌతున్నారని తెలిపారు. భవిష్యత్తులో వామపక్షఫ్రంట్‌ పట్ల బెంగాల్‌ ప్రజానీకం తిరిగి విశ్వాసం చూపగలదన్నారు. మావోయిస్టులతో కలిసి తృణమూల్‌ గూండాలు బెంగాల్‌లో పెద్దసంఖ్యలో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలను, వామపక్ష సానుభూతిపరులను హత్య చేశాయని తెలిపారు. 2009 ఎన్నికల తరువాత 450 మంది వారి దాడులకు బలయ్యారని తెలిపారు. ఎన్నికల అవసరం తీరాక ఇప్పుడు మావోయిస్టులపై మమతాబెనర్జి దాడులకు సిద్దమౌతున్నారని ఈ పరిణామాలను మావోయిస్టు పార్టీ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
                పెట్టుబడిదారి విధానానికి సోషలిజమే ప్రత్యామ్నాయమన్న విషయాన్ని లాటిన్‌ అమెరికాతో పాటు పలు యూరోపియన్‌ దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయని అన్నారు. భారతదేశంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులే ఈ తరహా ప్రత్యామ్నాయాన్ని అందించగలవని తెలిపారు. దీనిలో భాగంగా సామ్రాజ్యవాదానికి, నయా ఉదారవాద విధానాలకు, మతతత్వానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
( ప్రజాశక్తి సౌజన్యంతో..... )  
 

No comments:

Post a Comment