Saturday, May 5, 2012

కార్మికుల సుదీర్ఘ పోరాట ఫలం...

సోషలిజం దిశగా తొలి అడుగు : ఛావెజ్‌ 
వెనిజులాలో కొత్త కార్మిక చట్టం

                అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ సంతకం చేసిన నూతన సమగ్ర కార్మిక చట్టం వెనిజులాలో సోషలిజం దిశగా మార్పులో తొలి అడుగని ఆ దేశ ప్రభుత్వం అభివర్ణించింది. ఈ చారిత్రిక పత్రంపై సంతకాలు చేసిన సందర్భాన్ని జరుపుకునేందుకు మేడే రోజున వేలాది మంది రాజధాని వీధుల్లో ప్రదర్శన జరిపారు. 'దీర్ఘకాలిక ప్రతిఘటన, పోరాటం, ఇంకా చెప్పాలంటే ఇబ్బందుల క్రమం లేకుండా ప్రజలు, కార్మికులు ఎన్నడూ విజయం సాధించలేదు. ఇప్పుడు నేను సంతకం చేసే గౌరవాన్ని అందించిన ఈ చట్టం కూడా సుదీర్ఘ పోరాట క్రమం ఫలితమే' అని అధ్యక్షుడు ఛావెజ్‌ చెప్పారు. ఈ కొత్త చట్టం ప్రకారం పనిని వారంలో 40 గంటలకు తగ్గిస్తుంది. 1990ల నుంచి సాగిన నయా ఉదారవాద విధానాల దోపిడీ రూపంగా భావిస్తున్న దేశంలోని ప్రయివేటు సబ్‌ కాంట్రాక్టు లేబర్‌ను రద్దు చేస్తుంది. ప్రసవానంతర సెలవును 12 నుంచి 25 వారాలకు పెంచడం, బిడ్డ పుట్టిన అనంతరం రెండేళ్ళ పాటు డిస్మిస్‌ కాకుండా నూతన దంపతులను కాపాడటం ద్వారా పని ప్రదేశంలో జండర్‌ సమానత్వం దిశగా ఇది గొప్ప ముందడుగని మహిళా గ్రూపులు ఈ చట్టాన్ని ప్రశంసించాయి.
                 1997లో అప్పటి రఫాయెల్‌ కాల్డెరా ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, కార్పొరేట్‌ ప్రయోజనాల ఒత్తిడికి తలొగ్గి రద్దు చేసిన కొన్ని కార్మిక హక్కులను ఈ చట్టం తిరిగి కల్పిస్తుంది. ఈ చట్టాన్ని అనుసరించి కార్మికుడు చివరి నెలలో తీసుకున్న జీతాన్ని అతడు సేవలందించిన సంవత్సరాల సంఖ్యతో గుణించడం ద్వారా కార్మికుల రిటైర్మెంట్‌ బోనస్‌ను తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు ఎవరైనా కార్మికుడ్ని యజమాని అక్రమంగా తొలగిస్తే బోనస్‌గా రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 12 నెలల్లో అమలు చేయాల్సి ఉన్న ఈ కొత్త చట్టాన్ని యజమానులు ఏ మేరకు అమలు చేస్తున్నారనే విషయాన్ని పర్యవేక్షించేందుకు ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కార్మికులు రిటైరైన తరువాత తమ ప్రయోజనాలను ఒక ప్రయివేటు బ్యాంక్‌, ప్రభుత్వ బ్యాంక్‌ లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ రిటైర్మెంట్‌ నిధి ద్వారా తమకు ఏది ఇష్టమైతే అందులో ప్రాసెస్‌ చేసుకునేందుకు అవకాశముంది. ఛావెజ్‌ ఈ సంవత్సరం ప్రారంభంలో నెలవారీ కనీస వేతనాన్ని 32.5 శాతం పెంచుతూ ప్రకటించారు. దాన్ని రెండు దశలుగా అమలు చేస్తున్నారు. మొదటి దశ మే 1 నుంచి 1,548 బొలివార్ల నుంచి 1,780 బొలివార్ల పెంపుదలతో అమలులోకి వచ్చింది. సెప్టెంబర్‌లో 2,047 బొలివార్లలో 15 శాతం పెంపుదల వస్తుంది. ఈ నూతన చట్టం సోషలిజపు అత్యున్నత దశ నిర్మాణానికి సాధనమని విదేశాంగ మంత్రి నికొలస్‌ మదురా పేర్కొన్నారు. నాల్గింట ఒక వంతు మంది నిరుద్యోగులుగా ఉన్న స్పెయిన్‌లోని కార్మిక వ్యతిరేక చట్టాలకు ఇది పూర్తిగా భిన్నమైందని అన్నారు. వెనిజులా శాసన నిర్మాతలు దాదాపు మూడేళ్ల నుంచి కార్మిక సంస్కరణలపై చర్చిస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరిస్తానని ఛావెజ్‌ వాగ్దానం చేసిన గత నవంబర్‌ నుంచి అవి వేగం పుంజుకున్నాయి. 'దోపిడీతో కూడిన పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల నుంచి ఎలాంటి దోపిడీ లేని సోషలిస్టు ఉత్పత్తి సంబంధాల దిశగా కదలాలనే మా ఆకాంక్షను పునరుద్ఘాటిస్తున్నాం' అని వెనిజులా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పెడ్రో యూస్సే చెప్పారు. ఈ చట్టానికి 80 శాతం మంది వెనిజులా ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు అంతర్జాతీయ పోలింగ్‌ సంస్థ ఇంటర్నేషనల్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ వివరించింది. 
( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

No comments:

Post a Comment