Saturday, April 14, 2012

కార్టూన్‌ వేయడం నేరమా?




పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ సర్కార్‌ మరో అప్రజాస్వామిక చర్యకు పాల్పడింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర రైల్వే మంత్రి ముకుల్‌రారు, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్‌ త్రివేదిపై వ్యంగ్య కార్టూన్‌ వేసిన జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ అంబికేష్‌ మహాపాత్రపై సైబర్‌ నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసింది. అంతకు ముందు ప్రొఫెసర్‌పై తృణమూల్‌ గూండాలు దాడి చేసి విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. తృణమూల్‌ గూండాలు దాడి చేసి వెళ్లగానే పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం.
                 కార్టూన్‌ వేసి సామాజిక నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లలో ఉంచిన ప్రొఫెసర్‌ను అరెస్టు చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకునే హక్కు కూడా పౌరులకు లేదా. ప్రభుత్యాధినేతలకు వ్యతిరేకంగా ప్రతిదినం దినపత్రికల్లో వ్యంగ్య కార్టూన్లు వస్తున్న విషయాన్ని ఉదహరిస్తున్న నెటిజన్లు, ఈ అరెస్టుతో బెంగాల్‌ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. పలు అంశాలు, వ్యక్తులు, విధానాలు, తదితర ప్రతి అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించడం, చర్చించడం సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లలో సర్వ సాధారణం. సృజనాత్మకత ఉన్న ఎంతో మంది సామాజిక వెబ్‌సైట్ల ద్వారా వ్యంగ్య కార్టూన్లు, పేరడీ గేయాలు, పాటలు, వీడియోలను ఉంచుతూ తమ ప్రతిభను ప్రదర్శించుకుంటున్నారు.
               ప్రధాని మన్మోహన్‌, కేంద్ర మంత్రులు, ఇతర దేశాల నేతలపై కూడా ఎన్నో వ్యంగ్య కార్టూన్‌లు మనకు వెబ్‌సైట్లలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే అన్ని రకాల స్వేచ్ఛలనూ హరించి వేయడమే లక్ష్యంగా ఇటీవల కాలంలో నిర్ణయాలు తీసుకుంటున్న మమతా సర్కారుకు తమ సిఎంపై వ్యంగ్య కార్టూన్‌ వేయడం కోపం తెప్పించింది. అంతే, ఆఘమేఘాల మీద సైబర్‌ చట్టాల కింద కేసు నమోదు, అరెస్ట్‌ కూడా జరిగిపోయింది. మహిళలపై అత్యాచారాలు, హత్య కేసుల్లోనూ, ఇతర తీవ్ర సంఘటనల్లోనూ ప్రజల నుంచి డిమాండ్‌ వచ్చే వరకూ ఏనాడూ స్పందించని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేసు నమోదు నుంచి అరెస్ట్‌ వరకూ అన్ని కార్యక్రమాలూ ఒక్క రోజులోనే చేపట్టడం గమనార్హం.
              సినీ దర్శకుడు మృణాల్‌ సేన్‌, చిత్రకారుడు వసీం కపూర్‌, సాంస్కృతిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సర్కారు తీరును తప్పుపట్టారు. ప్రొఫెసర్‌పై సైబర్‌ నేరాలు మోపడం పూర్తి అన్యాయమని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. తమ ప్రొఫెసర్‌ అరెస్టుకు నిరసనగా జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ విద్యార్థులు వర్శిటీ ప్రాంగణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఫాసిస్టు ధోరణిని అవలంబిస్తోందని, చిన్నపాటి విమర్శను కూడా సహించలేక పోతోందని అందరు విమర్శించారు. 
 ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

Tuesday, April 10, 2012

ప్రపంచ మానవాళిని ఉత్తేజపరుస్తూనే ఉన్న మానవతామూర్తి...


మూర్తీభవించిన మానవత్వమే లెనిన్‌!
మహామేధస్సు, సంపూర్ణ మానవతల సమ్మేళనమే లెనిన్‌! 

    అరుదైన ఆ మానవోత్తముడు 1870 ఏప్రిల్‌ 10న జన్మించారు. మానవాళికి న్యాయమార్గం చూపటానికా అన్నట్లు 1893లో న్యాయవాది అయ్యారు. న్యాయమైన సమసమాజ స్థాపనా లక్ష్యంతో 1895లో విప్లవవాది అయ్యారు. ఉద్యమ భాగస్వామి కృపస్కయను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. 1917 అక్టోబరు 7న బోల్షివిక్‌ పార్టీ సారథ్యంలో 'యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌'కు అధ్యక్షులయ్యారు!

    1917 అక్టోబరు 25 రాత్రి ఒక అద్భుతమైన రాత్రి! అది కెరెన్‌స్కీ ప్రభుత్వం పతనమైన రాత్రి! రెండు దశాబ్దాలుగా పలు శిక్షలకు గురవుతూ, అజ్ఞాతవాసంలో మగ్గిన లెనిన్‌, అర్ధాంగితో సహా తన మిత్రుని ఇంట స్వేచ్ఛగా విశ్రాంతి తీసుకున్న రాత్రి! 'ఈ క్షణం నుండి, ఎట్టి నష్టపరిహారమూ చెల్లించకుండా, భూస్వాముల అస్తి రద్దు చేయబడింది'' అను సోషలిస్టు రిపబ్లిక్‌ తొలి డిక్రీని రూపొందించి, లెనిన్‌ చరిత్ర గతినే మార్చేసిన రాత్రి! సదరు డిక్రీని మళ్లీ,మళ్లీ చూసుకుంటూ, ''ఇక నుండి ఈ పొలం అనే ఆవు, రైతులు, వ్యవసాయ కూలీలు అనే తన లేగదూడలకు తాగినన్ని పాలు ఇస్తుంది! వాళ్లంతా తమ తల్లిపాలను తనివితీరా తాగుతారుగదా!'' అన్న భావనతో ఆ ఆనందాన్ని అమితానందంతో నిద్రపట్టని వారి మిత్రుడు కూడా అక్కడికొచ్చి వారినలా చూసి పరవశంలో గంతులేస్తుంటాడు. మానవులంతా సుఖంగా జీవించే మార్గాన్ని చూపగలిగినందుకు, ఆనంద కెరటాల తాకిడికి లెనిన్‌ ఉక్కిరిబిక్కిరియైన ఆ రాత్రి నిజంగా మహాద్భుతమైన రాత్రి!

     లెనిన్‌ మనసు, మాట, చేతల కెన్నడూ తేడా కనిపించలేదు. త్రికరణశుద్ధిగా సోషలిస్టు లక్ష్యానికి అంకితమయ్యారు. సమసమాజపు వెలుగు కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు! జీవితాంతమూ మద్యం, పొగాకు ముట్టని ఆదర్శనేత! ఆరోగ్యం కోసం మెరుగైన ఆహారం, ప్రత్యేక వసతులు అవసరమని డాక్టర్లు, ఆత్మీయులు మొత్తుకుంటున్నా 'ప్రజలు హీనంగా బతుకుతున్న సమయంలో అంతకన్నా బాగా బతికే నైతిక హక్కు నాకు లేదు' అంటూ వాటిని తిరస్కరించారు లెనిన్‌! మానవతను గూర్చి ఆయనకు మించిన అవగాహన కలవారు లేరు! లెనిన్‌ విప్లవ సాహసానికి, విజయానికీ అదే ఆయువుపట్టు!


          లెనిన్‌ జీవితాంతం ప్రతి మనిషి పట్లా, అతని వృత్తి ఉద్యోగ, హోదాలతో నిమిత్తం లేకుండా అమితంగా శ్రద్ధ వహించారు! ఆయన దయార్ద్ర హృదయాన్ని, ప్రేమ ఆప్యాయతలను ఒక్కసారైనా చవిచూడని కామ్రేడ్‌గాని, గ్రామం గాని సోషలిస్టు రష్యాలో లేదంటే అతిశయోక్తి కాదు.  సమసమాజపు వెలుగు కోసం కొవ్వొత్తిలా ఆత్మార్పణ చేసుకుంటూ నాటి కరాళ కరువు, భయంకర అంతర్‌, బాహ్య యుద్ధాల బారి నుండి తమ సోషలిస్టు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు, నాడు రష్యన్లను ఉత్తేజపరచిన ఆ మహనీయ, మానవతామూర్తి లెనిన్‌, నేటికీ అట్టి సమసమాజం కోసం తపనతో శ్రమించేలా ప్రపంచ మానవాళిని ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. అమరజీవి లెనిన్‌!

 ఏప్రిల్‌ 10న 142వ జయంతి సందర్భంగా   

Monday, April 2, 2012

సీపీఐ జాతీయ సారథ్య బాధ్యతలను చేపట్టిన తెలుగువారు


  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. పాట్నాలో జరిగిన సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ)21వ జాతీయ మహాసభల్లో బర్థన్ స్థానంలో ఆయన్ని పార్టీ ప్రతినిధులు ఎన్నుకున్నారు. జాతీయ రాజకీయ చిత్రంపై మరోసారి ఓ తెలుగువారిని ఉన్నతమైన పదవి వరించింది. 24ఏళ్ళ తర్వాత సీపీఐ సారథ్య బాధ్యతలను చేపట్టిన తెలుగువారిగా సురవరం చరిత్ర సృష్టించారు.

    సుదీర్ఘ కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం కలిగిన సురవరం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారు.  సమరశీల రాజకీయ కార్యకర్త, మేధావి, మంచి వక్త.  2008 మార్చి నుండి పార్టీ ఉపప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పటికి ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి కార్యదర్శిగా, జాతీయ సమితి కార్య వర్గ సభ్యులుగా వున్నారు.
            సురవరం నల్గొండ నుంచి 1998లో తిరిగి 2004 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికై ప్రతిభావంతుడైన పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు.


Friday, March 23, 2012

ఆయన పేరే యువతకు ఉత్తేజం...స్ఫూర్తి ...


 'షహీద్‌ భగత్‌సింగ్‌ పేరే యువతకు ఉత్తేజం. ఆయన స్ఫూర్తి
 పోరాట సంప్రదాయాలకో సంకేతం. 
త్యాగం ఆదర్శానికి నిదర్శనం.
 మూయించిన ఒక వీరుని కంఠం వేయిగొంతుకల విప్లవ శంఖం
              అన్న మహాకవి ఆవేదనను భగభగమండే అగ్నికణం లాంటి భగత్‌సింగ్‌ నిస్వార్థ పోరాట సంప్రదాయాలతో పోల్చడం సమంజసంగా ఉంటుంది. లాహోరు జైల్లో 1931 మార్చి 23న సంధ్యా సమయంలో స్వాతంత్య్రం కావాలి, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, విప్లవం వర్థిల్లాలిః, తెల్లదొరతనం పోవాలి, అన్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. కోట్లాది భారతీయుల హృదయాల్లో ఆరని జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతాడని ఎవరు ఊహింలేదు.

                         1928 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు ఆర్థిక సంక్షోభం నీలినీడలు భారతదేశంపై కూడా పడ్డాయి. దేశమంతా పెద్ద పెద్ద పోరాటాలు, సమ్మెలు జరిగాయి. సరిగ్గా ఇదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఢిల్లీలో అన్ని ప్రాంతాలకు చెందిన విప్లవకారులను సమావేశపరిచి, హిందూస్థాన్‌ సోషలిస్టు ప్రజాతంత్ర సంఘం అనే సంస్థను ఏర్పరిచారు భగత్‌సింగ్‌.  సోషలిజమే పార్టీ లక్ష్యంగా నిర్ణయించారు. పరిస్థితులు త్వరితగతిన మార్పు చెందుతున్నాయి. సైమన్‌ కమిషన్‌ గోబ్యాక్‌ అనే నినాదాలు నిప్పురవ్వల్లా బ్రిటిష్‌ వారిని దహించి వేస్తున్నాయి. దాన్ని సహించలేని వారు పంజాబ్‌ సింహం లాలా లజపతిరాయ్‌ని బలి తీసుకున్నారు. కార్మిక వర్గం వర్థిల్లాలిః, సామ్రాజ్యవాదం నశించాలిః, సోషలిజం వర్థిల్లాలిః, విప్లవం వర్థిల్లాలిః, అంటూ వారు చేసిన నినాదాలతో పార్లమెంటు హాలంతా మారుమ్రోగిపోయింది. ఎవరినో ఒకర్ని చంపేందుకు బాంబులు ఉపయోగించ లేదు. కేవలం చెవిటివాడిగా నటిస్తున్న ప్రభుత్వానికి ప్రజాఘోష వినిపించేందుకు మాత్రమే ఆ చర్య చేపట్టాల్సి వచ్చిందని భగత్‌సింగ్‌ వివరణ ఇచ్చారు.

                 కోర్టులో విచారణ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే భగత్‌సింగ్‌తో పాటు రాజగురు, సుఖదేవ్‌లకు కూడా ఉరిశిక్షను విధించారు. కోర్టును తమ భావాల ప్రచారానికి వేదికగా ఉపయోగించుకోవాలనుకున్న భగత్‌ సహచరుల కోరిక నెరవేరింది. పరాయి ప్రభుత్వం తన రాక్షస కబంధ హస్తాలతో వజ్రాల్లాంటి ముగ్గురు విప్లవవీరుల్ని సజీవంగా సమాధి చేసేందుకు ముహూర్తం నిర్ణయించింది. 1931 మార్చి 23న లాహోర్‌ జైల్లో టైప్‌మిషన్లు అధికారుల ఆదేశాలను టకటకమంటూ కొడుతున్నాయి. లాహోర్‌ జైల్లో చీకట్లు అంతటా వ్యాపించాయి.  ఇక జీవితంలో భగత్‌సింగ్‌ను చూడబోముః అనే భావన తోటి విప్లవకారుల చేత కన్నీరు పెట్టించింది. భావావేశపరుడయ్యే సమయం ఇంకా రాలేదు శివవర్మ. నేను కొన్ని రోజుల్లోనే అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతాను. కానీ మీరు దీర్ఘప్రయాణం చేయవలసి ఉంది. బాధ్యత అనే పెద్ద బరువును మోయవలసి వున్నప్పటికీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో నీవు అలసిపోవనీ, ధైర్యం కోల్పోవనీ, ఓటమి స్వీకరించి చతికిలబడిపోవని నా గట్టి నమ్మకం, అంటూ స్నేహితుడికి సందేశం ఇచ్చాడు భగత్‌సింగ్‌. 
                 ఆ కర్తవ్య దిశగా నేటి విద్యార్ధి, యువత భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులవటమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.


          భారత స్వాతంత్య్ర సమరంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ లు అమరులైనారు. ఆ యోధులకు వందనాలు.

         భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ల 81వ వర్ధంతి ( మార్చి 23) సందర్భంగా... 

Friday, March 16, 2012

సెంచరీల " సెంచరీ వీరుడు" ...


                    ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన సెంచరీల సెంచరీ వీరుడు (100 సెంచరీలు) సాధించిన బ్యాట్స్ మెన్. 
                     ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్  టెండుల్కర్. క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్. భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్.  1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చినాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్.

వన్డే రికార్డులు
వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (95 అర్థ సెంచరీలు)
అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (18412 పరుగులు) 
అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (462 వన్డేలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (14 సార్లు)


టెస్ట్ రికార్డులు
టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు)
టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (63అర్థ సెంచరీలు)
20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)
అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు

Saturday, March 10, 2012

మిస్టర్‌ డిపెండబుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు ...


             మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం మీడియా సమావేశంలో ద్రవిడ్‌ ఈ విషయాన్ని ప్రకటించాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ 16 ఏళ్లపాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ద్రవిడ్‌ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. ది వాల్‌, మిస్టర్‌ డిపెండబుల్‌గా పేరొందిన ద్రవిడ్‌ భారత క్రికెట్‌కు అందించిన సేవలు వర్ణించలేనివి.
                   164 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ద్రవిడ్‌ 52.31 సగటుతో 13,288 పరుగులు సాధించాడు. ఇందులో 36 శతకాలు, 63 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 210 క్యాచ్‌లను పట్టి అత్యధిక క్యాచ్‌లను పట్టిన క్రికెటర్‌గా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు. దీంతోపాటు 25 టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీనిలో భారత్‌ 8 మ్యాచుల్లో విజయం సాధించగా, ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. మరో 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. వన్డేల్లో కూడా ద్రవిడ్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం 344 మ్యాచ్‌లు ఆడిన దివాల్‌ 39.16 సగటుతో 10,889 పరుగులు సాధించాడు. వీటిలో 12 శతకాలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  ద్రవిడ్‌ 196 క్యాచ్‌లను కూడా పట్టాడు. సమకాలిన క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఖ్యాతి గడించిన ద్రవిడ్‌ భారత్‌ క్రికెట్‌ అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. ఉత్తమ టెక్నిక్‌తో భారత ఇన్నింగ్స్‌కు పెట్టని గోడగా నిలిచే ద్రావిడ్‌ను పెవిలియన్‌కు పంపడానికి ఉద్ధండ బౌలర్లు కూడా అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.  క్లిష్ట సమయంలోనూ నిబ్బరంగా ఆడే సత్తా ఒక్క ద్రవిడ్‌కే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విదేశి గడ్డపై అద్భుత రికార్డు కలిగిన ద్రవిడ్‌ భారత్‌కు ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు.కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హైదరాబాదీ వివిఎస్. లక్ష్మణ్‌తో కలిసి నెలకొల్పిన రికార్డు భాగస్వామ్యం క్రికెట్‌ చరిత్రలోనే అత్యద్భుత ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

           ప్రపంచ క్రికెట్‌లో ద్రవిడ్‌ అద్భుత ఆటగాడు. ఆటగాడిగా ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేయడం దాదాపు అసాధ్యము.  భారత్‌కు లభించిన ఆణిముత్యాల్లో ద్రవిడ్‌ ఒకడు. సుదీర్ఘ కెరీర్‌లో ద్రవిడ్‌ సాగించిన ప్రస్థానం, భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టిన ఘనత ద్రవిడ్‌కే దక్కుతుంది.

Thursday, March 8, 2012

ఆకాశంలో సగం ...


నేడు 102 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

               మహిళా దినోత్సవాలెన్ని జరుపుకున్నా ఆకాశంలో సగ భాగంగా ఉన్న మహిళల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రాలేదు. అసమానత, అణచివేత, దోపిడీ అంతంకాలేదు. గత రెండు దశాబ్దాలుగా పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు, పెంచిపోషిస్తున్న వినిమయ, వినోద సంస్కృతి మహిళలను కడగండ్లపాల్జేస్తున్నాయి. సామాజిక, ఆర్థిక పరంగా మహిళలపై దాడులకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ విధంగా స్త్రీ అస్తిత్వానికే ఇవి సవాల్‌గా పరిణమించాయి. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, మత ఛాందసవాదం సాగిస్తున్న ఈ ముప్పేట దాడికి ప్రతిఘటన కూడా పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు తమ అస్థిత్వం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మహిళా దినోత్సవం నాడు దోపిడీ, అణచివేత, హింస, అసమానతల నుండి విముక్తి కోసం శ్రామిక మహిళలు పోరాడి రక్తతర్పణ చేసిన చారిత్రాత్మక రోజు అయిన ఈ మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరముంది. మహిళ ఉద్యమాలకు దిక్చూచి. 

                చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే చట్టం పట్ల బోలెడు శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తూనే మోకాలడ్డుతున్నారందరూ. వామపక్షాలు మాత్రమే దీనికి మినహాయింపు. కేరళలో సిపిఎం ఆధ్వర్యంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థలో 50శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. అలాగే చట్ట సభల్లో మహిళలరిజర్వేషన్ల బిల్లుకు వామపక్షాలు సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించినా సోనియా గాంధీ నాయకత్వంలోని యుపిఏ సర్కార్‌ 'ఏకాభిప్రాయం కోసం' అంటూ లోక్‌సభలో పెట్టకుండా వాయిదాలు వేస్తున్నది. 

           అంతర్జాతీయ మహిళా దినోత్సవం  ( మార్చి 8)